133వ మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి పలు ముఖ్యాంశాలను ప్రస్తావించారని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ముళ్ళపూడి రేణుక తెలిపారు.
ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని దేశప్రజలతో నేరుగా మమేకమవుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సామాన్య ప్రజల విజయకథలు, మారుమూల ప్రాంతాల పురోగతిని పంచుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈరోజు ఎపిసోడ్‌లో ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ మరియు సస్టైనబిలిటీపై ప్రధాని దృష్టి సారించారని తెలిపారు. స్వచ్ఛమైన గాలి కేవలం ఆరోగ్య పరిరక్షణకే కాకుండా, దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన క్లీన్ ఎనర్జీ వనరుగా మారాలని ఆయన సూచించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ప్రకృతి ఆధారిత వనరుల వినియోగాన్ని పెంపొందించడం అత్యవసరమని ప్రధాని స్పష్టం చేశారని వివరించారు.
అలాగే ఈశాన్య రాష్ట్రాలను “అష్టలక్ష్మి”గా అభివర్ణిస్తూ, ఆ ప్రాంతాల అభివృద్ధి, చేతివృత్తులు, కుటీర పరిశ్రమల ప్రగతిని ప్రధాని ప్రశంసించారని తెలిపారు. స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రాధాన్యత పొందుతూ, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని పేర్కొన్నారు.
పర్యాటక రంగంలో వినూత్న ఆలోచనల ద్వారా ఎడారి ప్రాంతాలను కూడా ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయవచ్చని ప్రధాని సూచించారని తెలిపారు.
“లోకల్ టు గ్లోబల్” భావనను ప్రోత్సహిస్తూ, స్వదేశీ ఉత్పత్తుల తయారీ మరియు వినియోగం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేయవచ్చని మోదీ జీ వివరించారని చెప్పారు. మొత్తంగా మన్ కీ బాత్ కార్యక్రమం దేశ ప్రజలను ఒక కుటుంబంగా భావిస్తూ, వారి మధ్య అవగాహన పెంపొందించడమే కాకుండా, సానుకూల మార్పుల దిశగా నడిపించే వేదికగా నిలుస్తోందని డా. ముళ్ళపూడి రేణుక పేర్కొన్నారు.



