అన్ని వర్గాలకు సమన్యాయం చేసిన చంద్రబాబు
రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు రాజధాని నిర్మించిన ఘనత
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
తణుకులో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
సామాజిక సేవా కార్యక్రమాల్లో కూటమి శ్రేణులు
తోపుడు బళ్లు, ఎగ్ కార్డ్స్ అందజేసిన ఎమ్మెల్యే
అన్న క్యాంటీన్లో ఉచిత భోజన వసతి కల్పించిన శ్రేణులు
రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించే విధంగా అన్ని సామాజిక వర్గాలను సమ న్యాయం చేసే విధంగా చంద్రబాబు నాయుడి పరిపాలన దక్షతకు నిదర్శనమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ చెప్పారు. రాజకీయాల్లో 45 ఏళ్లుగా కొనసాగుతూ నిబద్ధతతో ప్రజా సేవలో నిమగ్నమైన చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను సోమవారం తణుకు కూటమి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి సంబరాలను ప్రారంభించి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర ప్రజలకు వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేందుకు చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. గత ప్రభుత్వంలో ఐటి విప్లవం తీసుకు వచ్చి విజన్ 2020 వంటి వినూత్న పథకాలను అమలులోకి తీసుకువచ్చి యువతకు మార్గదర్శకంగా నిలిచారని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేసిన ఆయన సంక్షేమాన్ని పెద్ద ఎత్తున పరుగులు పెట్టిస్తున్న నేత చంద్రబాబు నాయుడు అని అన్నారు. అమరావతి నగర నిర్మాణంలో ఒక రూపకల్పన చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం రాజధాని నిర్మించిన ఘనత ఆయనకే చెందుతుందని అన్నారు. యువత పట్ల, రాష్ట్ర ప్రజల సంక్షేమం పట్ల అందరికీ అందుబాటులో ఉంటూ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 24 నెలలుగా చంద్రబాబు నాయుడు, మోడీ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ సహకారంతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకువస్తున్న పరిశ్రమలు కారణంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రతిపక్షంలో సైతం ఉన్న సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి పక్షాన పోరాడుతూ ప్రజల్ని చైతన్యం చేసే విధంగా కృషి చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. ప్రతి రెండేళ్లకోసారి సంస్థాగత నిర్మాణం చేపట్టే విధంగా చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో సైతం చెరగని ముద్ర వేసిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతం తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే విధంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నారు. సామాజిక న్యాయాన్ని కాపాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ఎంతో మంది దళిత యువకులకు రాజకీయ అవకాశాలు కల్పించి ఉన్నత స్థానాల్లో నిలబెట్టిన ఘనత చంద్రబాబు నాయుడుది అని పేర్కొన్నారు. అనంతరం 14 మందికి తోపుడుబండ్లు, ఏడుగురికి హెడ్ కార్డ్స్ అందజేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్న క్యాంటీన్లో మూడుపూటలు ఉచిత భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


