అతడు నిజామాబాద్ కు చెందిన అపర దానకర్ణుడిగా పేరుపొందిన వ్యక్తి, ముఖ్యంగా కుష్టు వ్యాధితో బాధపడేవారి కోసం విక్టోరియా ఆస్పత్రిని స్థాపించడం లో ప్రధాన పాత్ర వహించారు. సమాజిక సేవలో ఉన్న స్వచ్ఛంద సంస్థలకు ఆయన చేసిన విశేష కృషికి పేరుగాంచారు. ప్రముఖ రచయిత డా. పి. కేశవరెడ్డి గారు పాండిచ్చేరి యూనివర్సిటీలో తన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని విక్టోరియా ఆస్పత్రిలోనే వైద్యునిగా చివరివరకు పనిచేశారు. ఈ రోజు రాజా నర్సాగౌడ్ గారి వర్ధంతి జ్ఞాపకం !
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
“రాజా” నర్సా గౌడ్” సిర్నేపల్లీ గడి యొక్క మొదటి పాలకుడు. హైదరాబాద్ గౌడ్ హాస్టల్ ప్రదాత (1866-1948) ఆ కాలంలో దేశంలో అతి పెద్ద కుబేర జాబితాలో ఒకరు. పేదలకు వందల ఎకరాల భూదానం చేసి అపర దానకర్ణుడిగా పేరుపొందిన
బి సి వర్గానికి చెందిన మహోన్నత వ్యక్తి.
……
సంపన్నుడైన నర్సాగౌడ్ గారు 1866లో నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. వారి తల్లిదండ్రుల ముగ్గురు సంతానంలో ఇతడు చివరివారు. వారి అన్నలు రామాగౌడ్, లక్ష్మాగౌడ్ తమ కుటుంబ వ్యాపారమైన ఎక్సైజ్ వ్యాపారం నిమిత్తం ఎక్కువగా ప్రయాణాలు చేస్తూవుంటే ఇతడు నిజామాబాదులో వుంటూ వ్యాపార లావాదేవీలు చూసుకునేవారు. ఈ ముగ్గురు సోదరులూ తమ వ్యాపారాన్ని విస్తరించి హైదరాబాద్ స్టేట్‌లో అత్యంత ధనిక కుటుంబాలలో ఒకరుగా ఎదిగారు. ఇతని మనుమరాలు బొమ్మ హేమాదేవి నవలా రచయిత్రిగా ప్రసిద్ధురాలు. మరొక మనుమరాలు ఆర్.అఖిలేశ్వరి తొలితరపు మహిళా జర్నలిస్టుగా ప్రసిద్ధి పొందిందిన వారు.
- .దాతృత్వం…సేవాకార్యక్రమాలు….
నర్సాగౌడ్ గారు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా సమాజసేవ చేయడంలోకూడా ఆసక్తిని కనబరచేవారు. దానధర్మాలు చేసినప్పుడు కులమతాల వివక్షతను పాటించే వారు కాదు. గుళ్లు, మసీదులు, దర్గాల నిర్మాణానికి ఉదారంగా ఆర్థికసహాయం చేశారు. నిజామాబాదులోని కొత్తగల్లీలోను, కంఠేశ్వర్‌లోను బీదవారికి,బ్రాహ్మణులకు ధర్మసత్రాలను కట్టించారు. నిజామాబాద్ జిల్లాలోని చారిత్రక కట్టడాలు, పలు అధ్యాత్మిక క్షేత్రాల నిర్మాణం, పునరుద్ధరణకు కృషి చేశారు. జిల్లాకేంద్రమైన నిజామాబాదులో మొదటి నీటిట్యాంకు నిర్మాణం, నల్లాలు బిగించుటకు సిర్నపల్లి సంస్థాధీశురాలు ఛీలం జానకీబాయి సహకారంతో ఆర్థిక సహాకారం అందచేశారు. నిజాం పాలనలో సిల్లర్జుబ్లీ ఉత్సవాల సమయంలో టౌనుహాల్ను నిర్మింపజేశారు. ఇంకా శంభునిగుడి, నీలకంఠేశ్వరాలయం, సిఎస్ఐ చర్చి, మసీదుల నిర్మాణం, పునరుద్ధరణకు సహాకారం కూడా అందించారు.
……
1937లో నిజామాబాదులో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభల సందర్భంగా వేలాదిమందికి భోజన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ నుండి మంచిర్యాలకు మధ్య ఉన్న రహదారిలో ప్రతి కొన్ని మైళ్లకు ఒక బావి చొప్పున తవ్వించి ప్రయాణీకుల దాహాన్ని తీర్చారు. ఇల్లు లేని పేదవారికి కంఠేశ్వర్, విమ్రి గ్రామాలలో ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ప్రతియేటా బీదవారికి చలికాలం ప్రారంభమైయ్యే సమయానికి గొంగళ్లు, చెప్పులు పంచేవారు. వేసవి కాలంలో బీదవారికి అంబలి ఇచ్చేవారు.
…..
నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ప్రసూతి ఆసుపత్రి (జజ్గిఖానా) ఏర్పాటు చేయడానికి కారకులు. వారికి విద్యపట్ల నమ్మకం ఉండటం వలన అనేక మంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థికంగా చేసి సహాయపడ్డారు. వారి తోడ్పాటుతో చదువుకున్న అనేకులు ఇంజనీర్లు, డాక్టర్లు, జడ్జీలు, లోక్‌సభ సభ్యునిగా కూడా ఎదిగారు. వీరిలో అన్ని కులాలకు సంబంధించిన వారున్నారు. ఇతని సహాయంతో చదివి ఇంజనీర్ అయిన నారాయణ గౌడ్ అనే వ్యక్తికి తన మనుమరాలిని ఇచ్చి వివాహం చేశారు. నిజామాబాదులో మొట్టమొదటి బాలికల పాఠశాల ఏర్పాటుకు వారే కారకులు. వారు నివాసం ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు నర్సాగౌడ్ కాలనిగా పిలుస్తున్నారు.
- కుష్టునివారణ కేంద్రం స్థాపించడానికి భూదానం…
20వ శతాబ్దం ప్రారంభంలో, నిజామాబాద్ జిల్లాలో కుష్టువ్యాధి ఎక్కువగా ఉండేది మరియు మహిళలు మరియు పిల్లలు ఎక్కువగా బాధపడే వారు. అప్పట్లో నిజామాబాద్ ప్రాంతంలో ప్రతి వంద మందిలో ఒకరు కుష్ఠురోగం తో ఉండేవారు. ఈ పరిస్థితిని చూసి
ఒక మిషనరీ ఇలా వ్యాఖ్యానించారు , “కుష్టువ్యాధి మాతో నిజామాబాద్‌లో ఉంది. మేము భారతదేశంలోని అతిపెద్ద స్థానిక రాష్ట్రం యొక్క నడిబొడ్డున ఉన్నాము. వ్యాధి మన చుట్టూ ప్రబలుతోంది కానీ మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము. కుష్టువ్యాధి నివారణలో రాష్ట్ర నిబంధనలు సరిగా లేవు, కుష్ఠురోగి తన బంధువులతో సమానంగా కలిసి బతకాల్సి ఉంది. నిజామాబాద్ లోనే కుష్టువ్యాధి ఎక్కువ ప్రబలింద” ‘ అని వాపోయారు.
……
ఈ దారుణపరిస్థికి చెలంచి నర్సాగౌడ్ గారు డిచ్‌పల్లిలో తన 60 ఎకరాల భూమిని క్రిస్టియన్ మిషనరీలకు కుష్టునివారణ కేంద్రం స్థాపించడానికి దానం చేశారు . “ఇన్స్టిట్యూషనల్ కేర్ గివింగ్ హాస్పెటల్గా” ప్రారంభమైన ఈ ఆసుపత్రి భారతదేశంలోనే మొట్టమొదటిది.
……
నర్సా గౌడ్, (తరువాత రాజా) గారు నిజామాబాద్‌లోని ప్రముఖ నివాసి మరియు కుష్టు వ్యాధి బాధితుల బాధలను తెలిసిన వ్యాపారవేత్త, మిషనరీ దంపతులకు మద్దతు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. పట్టణంలోని నివాసి కావడంతో, అతను డాక్టర్ కెర్ యొక్క పనిని కూడా చూశారు. క్రైస్తవ మిషనరీల మానవతా సేవకు చాలా ముగ్ధుడయ్యాడు. అతను ఆ దంపతులను కలుసుకొని పట్టణం మరియు పొరుగు గ్రామాల కుష్టురోగుల కోసం వారి ఆందోళన మరియు సేవ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. వారిలో తనకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్న ఇరవై-ముగ్గురు ఉన్నారని వారికి ఎప్పటికప్పుడు సహాయం చేశానని కూడా అతను పేర్కొన్నారు .
…..
1907 నుండి నిజామాబాద్ గ్రామాలలో కుష్టు రోగులలో డాక్టర్ ఇసాబెల్ కెర్ చేస్తున్న కృషికి ముగ్ధుడై, కుష్టురోగులకు శాశ్వత చికిత్సా కేంద్రం ఆలోచనను బలపరిచి, అక్కడికక్కడే 10,000 రూపాయలు మరియు డిచ్‌పల్లిలో 60 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. మిషనరీలు నర్సా గౌడ్ యొక్క దాతృత్వానికి ముగ్ధులయ్యారు మరియు అతని సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. రాజా నర్సా గౌడ్ యొక్క దాతృత్వం ఒక అద్భుతమైన వైద్య సంస్థ స్థాపనకు దారితీసింది, ఇది నిజాం డొమినియన్స్లో మొదటిది. “ఏ కుష్ఠురోగి పిల్లవాడు ఎప్పుడూ కుష్టురోగిగా ఎదగనవసరం లేదు” అని డాక్టర్ ఇసాబెల్ కెర్ ఆనందోత్సాహాలతో ప్రకటించారు.
…..
1915లో, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో “వెస్లియన్
మెథడిస్ట్ మిషన్‌కు” చెందిన రెవరెండ్ GM కెర్ మరియు డాక్టర్ ఇసాబెల్ కెర్ చేత లెప్రసీ హోమ్/హాస్పిటల్ స్థాపించబడింది. ఇసాబెల్ కెర్ 1875లో స్కాట్లాండ్లోని ఫోహెబెసన్-స్పీలో 1875లో జన్మించారు. అబెర్డీన్ విశ్వవిద్యాలయం నుండి 1903లో మెడిసిన్ (MBBS)లో పట్టభద్రుడయ్యారు. వెస్లియన్ మెథడిస్ట్ మిషన్ సూపరింటెండెంట్ GM కెర్‌తో వివాహం తర్వాత, ఆమె నిజామాబాద్ వచ్చింది. ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభంలో అత్యంత భయంకరమైన అంటు వ్యాధి బాధితులను నయం చేయడం కోసం ఇది ఒకప్పటి నిజాం రాష్ట్రంలో మొట్టమొదటి మరియు అతిపెద్ద ఆశ్రయం మరియు వైద్య సంస్థగా నిలిచింది. ప్రారంభంలో క్రైస్తవ మిషనరీల ఆశ్రయం కోసం ఒక చిన్న “లెప్రసీ హట్”గా ప్రారంభమైన ఇది స్థానిక పరోపకారి రాజా నర్సా గౌడ్ కృషి కారణంగా మొత్తం దక్షిణ భారతదేశంలో ప్రముఖ వైద్య కేంద్రంగా ఎదిగింది
…..
1928లో “విక్టోరియా హాస్పిటల్” గా పేరు మార్చబడింది. బ్రిటీష్ ఇండియాలో మొట్టమొదటి లెప్రసీ ట్రీట్మెంట్ సెంటర్లలో ఒకదానిని ఏర్పాటు చేసినందుకు నర్సా గౌడ్‌కు పేరుంది. ప్రారంభంలో, ఆసుపత్రి స్థానిక ప్రజలకు, ప్రయాణికులకు మరియు శరణార్థులకు కుల, మత మరియు మతాలకు అతీతంగా ఉపశమన సంరక్షణను అందించింది. ప్రముఖ రచయిత డా. పి. కేశవరెడ్డి గారు పాండిచ్చేరి యూనివర్సిటీలో తన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి లోని విక్టోరియా ఆస్పత్రిలోనే వైద్యునిగా చివరివరకు పనిచేశారు.
- సన్మానాలు, బిరుదులు, గుర్తింపులు….
ఇతడు ఎన్ని దానధర్మాలు చేసినా ఇతనికి ప్రచారం చేసుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఒకసారి ఇతని ఏకైక కుమారుడు రామాగౌడ్ ఇతనికి తెలియకుండా ప్రసూతి ఆసుపత్రిలో దానిని నిర్మించింది నర్సాగౌడ్ అని తెలిపే ఒక శిలాఫలకాన్ని ప్రతిష్టించాడు. నర్సాగౌడ్ ఈ విషయం తెలిసిన వెంటనే దానిని తొలగించేలా చేశారు. అతి కష్టంమీద ఏడవ నిజాం ఫతే జంగ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రదానం చేసిన “రాజా” అనే బిరుదును అంగీకరించారు. 1930లో ఐదవ కింగ్ జార్జ్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇతడు సమాజానికి చేసిన సేవకు గుర్తింపుగా ఒక పతకాన్ని బహూకరించి సత్కరించారు.
- మరణం….
ఇతడు 1948, ఏప్రిల్ 4వ తేదీన తన 82వ యేట మరణించాడు. ఆ సమయంలో హైదరాబాదు స్టేట్‌లో రజాకార్ల ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంది. హిందూ ముస్లీముల మధ్య విద్వేషాలు, భయాందోళనలు పెచ్చిల్లుతున్న కాలమది. నర్సాగౌడ్ పార్థివదేహాన్ని స్మశానానికి తీసుకు వెళ్లడానికి సంశయిస్తున్నారు. కారణం స్మశానానికి వెళ్లడానికి ముస్లీముల ఇళ్ళను దాటి వెళ్ళడానికి అదొకటే మార్గం. ఆ దారిలో వెళితే ఏమి ప్రమాదం జరుగుతుందో అనిబ్భయపడ్డారు. కాని గత్యంతరం లేక అదే దారిలో వెళ్ళాల్సి వచ్చింది. అయితే వారు భయపడినట్లు కాక దారిలో ముస్లీములు నర్సాగౌడ్ గారి మంచితనం తెలిసిన వారు కాబట్టి శవానికి ఎదురువెళ్లి వారు కూడా ఆ శవాన్ని స్మశానం వరకూ మోసుకువెళ్లారు. నర్సాగౌడ్‌పై ఏ కులం వారికైనా, ఏ మతం వారికైనా అభిమాన గౌరవాలు ఉన్నాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా నిలిచింది.




