మోరంపూడి పోలేరమ్మ తల్లి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దుర్గేష్
శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులకు సేవా పురస్కారాల ప్రదానం
రాజమహేంద్రవరం: రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. సోమవారం రాజమహేంద్రవరంలోని మోరంపూడి గ్రామంలో కొలువై ఉన్న గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పోలేరమ్మ అమ్మవారి 12వ వార్షిక జాతర మహోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. భక్తిభావం సమాజంలో ఐక్యతను పెంచుతుందని, జాతరలు మన సంస్కృతికి ప్రతీకలని పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మంత్రి దుర్గేష్ కి ఘన స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
కళాకారులకు గౌరవం – సేవా పురస్కారాల ప్రదానం
అనంతరం రాజమహేంద్రవరంలోని జ్ఞాన సరస్వతి ఘాట్ వద్ద శోభిత్ వర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చల్లగాలి శ్రీనివాస్ వర్మ, వెంకట రమా కళ్యాణి, అక్షర మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభలో పలువురు కళాకారులను మంత్రి కందుల దుర్గేష్ జ్ఞాపికలతో సత్కరించారు. సమాజ సేవలోను, కళా రంగంలోనూ రాణిస్తున్న పలువురు ప్రతిభావంతులకు ‘సేవా పురస్కారాలను’ అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి దుర్గేష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కళలను ఆదరించడం, కళాకారులను ప్రోత్సహించడం మనందరి బాధ్యతని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ట్రస్ట్ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు మరియు కళాకారులు పాల్గొన్నారు.


