‘జలధార’తో ప్రతి ఎకరాకు సాగునీరు: మంత్రి కందుల దుర్గేష్

నీటి సంరక్షణపై 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై మంత్రి దుర్గేష్ అధ్యక్షతన సుదీర్ఘ సమీక్ష..భూగర్భ జలాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు, సాగునీటి సంఘాలకు దిశానిర్దేశం

“ప్రతి గ్రామానికి ‘నీటి బడ్జెట్’ – ప్రతి రైతుకు ‘సాగు భరోసా’.” -“సాగునీటి సంఘాలే ఈ జల యజ్ఞానికి డ్రైవింగ్ ఫోర్స్.” – ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌గా ‘జలధార’:మంత్రి దుర్గేష్

చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భజలాల పెంపు లక్ష్యంగా 4 దశల్లో కార్యక్రమం

నీటి భద్రత అంశంలో రైతులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచన..ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశం.. అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయం

ప్రతి నీటి చుక్కనూ సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతి రైతుకు భరోసానివ్వడమే కార్యక్రమం ఉద్దేశ్యమని మంత్రి దుర్గేష్ వెల్లడి

నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి నీటి భద్రత ప్రణాళిక, ప్రత్యేక నీటి బడ్జెట్ ను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ

కేవలం కాగితాల మీద ప్రణాళికలు కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు కనిపించాలన్న మంత్రి దుర్గేష్

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి దుర్గేష్ పిలుపు

నిడదవోలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన 100 రోజుల ‘నీటి సంరక్షణ – జలవనరుల పరిరక్షణ’ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో ‘జలధార’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం పెరవలి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు, సాగునీటి సంఘాల ప్రతినిధులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏప్రిల్ 6 నుండి జూలై 14 వరకు నిర్వహించే ఈ 100 రోజుల కార్యాచరణలో భాగంగా చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా 4 దశల్లో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రాష్ట్రంలోని చెరువులన్నీ నింపి, భూగర్భ జలమట్టాన్ని కనీసం 1.5 మీటర్ల మేర పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారని, ఆ మేరకు నియోజకవర్గంలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువులను అనుసంధానం చేసే చైన్ లింక్ విధానం ద్వారా నీటి నిల్వలను పెంచి, వేసవిలో తాగు, సాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. నీటి భద్రత అంశంలో రైతులను, ప్రజలను భాగస్వామ్యం చేయాలని.. ప్రతి నీటి చుక్కను పొదుపు చేద్దాం- ప్రతి ఎకరాకు నీరందిద్దాం అనే నినాదంతో అవగాహన కల్పించి ముందుకు వెళ్లాలన్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీల ప్రతిపాదనలను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి పంపాలన్నారు. “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” అనే నినాదంతో సాగునీటి సంఘాలు క్షేత్రస్థాయిలో డ్రైవింగ్ ఫోర్స్‌గా పనిచేయాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి వరకూ నీటి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించేలా స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిడదవోలు నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూడాలని స్పష్టం చేశారు.ప్రతి నీటి చుక్కనూ సంరక్షించడం, ప్రతి ఎకరాకు నీరందించడం, ప్రతి రైతుకు భరోసానివ్వడమే కార్యక్రమం ఉద్దేశమని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. వాటర్ బాడీస్ ఉండే చోట నీరు అడుగంటి పోకుండా అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రైతాంగానికి ఉపయోగపడే సాగునీటిని, ఇతరత్రా ఉపయోగపడే నీటిని తప్పకుండా అందించాలని తెలిపారు. ఈ క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను మంత్రి దుర్గేష్ వివరించారు. జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుందని, నియోజకవర్గాల్లో ప్రతి మండలానికి ఎంపీడీవో అధ్యక్షతన మండల కమిటీలు, గ్రామాల్లో గ్రామ కమిటీలు ఉంటాయన్నారు.
ఇందులో నీటి సంఘాలతో పాటు గ్రామ పంచాయతీలు, స్థానిక ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలన్నారు.

పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి దుర్గేష్ అధికారులను ఆదేశించారు. తొలుత స్థానిక నాయకత్వం, ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తొలుత ఏప్రిల్ 6 నుండి 15 వరకు పనులు గుర్తించాలన్నారు. ఏప్రిల్ 16 నుండి 20 వరకు ఏయే పనులు చేపట్టాలి, వాటికి అనుమతులు ఎలా సాధించాలి అంశంపై దృష్టి సారించాలన్నారు. అనంతరం ఏప్రిల్ 21 నుండి జులై 9 వరకు మంజూరైన పనులను అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జులై 10 నుండి 14 వరకు సిద్ధం చేసుకున్న యాక్షన్ ప్లాన్ ను ఏమేర సాధించామో సంబంధిత నివేదికను ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుందని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ నియోజకవర్గంలో ఉన్న చిన్న సాగు నీటి చెరువుల పునరుద్ధరణ వాటిని సక్రమంగా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు..చెరువులోకి నీరు చేరే కాలువలను శుభ్రపరచాలన్నారు. చెరువుల కట్టను బలోపేతం చేయాలన్నారు. సమీపంలోని కాలువలను చెరువులతో అనుసంధానం చేయాలన్నారు. వరద నీరు, వర్షపు నీరు ను చెరువుల్లోకి మళ్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. నీటి మరియు నేల తేమ సంరక్షణ నిర్మాణాలను పెంచాలన్నారు. తద్వారా భూగర్భజలాల పెంపు జరుగుతుందన్నారు. నీటి సంరక్షణ విధానాన్ని కచ్చితంగా అమలు చేసి తీరాలన్నారు. పచ్చదనం పెంచేందుకు కృషి చేయాలన్నారు. కొత్త నీటి సంరక్షణ నిర్మాణాలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామానికి నీటి భద్రత ప్రణాళిక, ప్రత్యేక నీటి బడ్జెట్ ను సిద్ధం చేయాలన్నారు. వీటన్నింటిని పూర్తిస్థాయిలో అమలు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. సాగునీటి శాఖ, వ్యవసాయ, ఉద్యాన, అటవీ, భూగర్భ జల తదితర శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లాలన్నారు. ఇది ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం అని తెలిపారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణను సాధించే దిశగా కృషి చేద్దామన్నారు. కేవలం కాగితాల మీద ప్రణాళికలు కాకుండా, క్షేత్రస్థాయిలో పనులు కనిపించాలని చెప్పారు.సాగునీటి సంఘాల ప్రతినిధులు కేవలం పర్యవేక్షకులుగా కాకుండా, ఈ యజ్ఞంలో భాగస్వాములుగా మారి రైతులకు అండగా నిలవాలని సూచించారు.గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి నీటి వనరును గుర్తించి, వాటిని పునరుద్ధరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి పేర్కొన్నారు.నీటి సంరక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత. ప్రజల సహకారం ఉంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ కార్యక్రమం విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల మార్గదర్శకత్వంలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వ సంకల్పమని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా తెలిపారు.

ఈ సమావేశంలో పెరవలి ఎంపీడీవో కేయుఆర్ఎల్ పద్మజ, పెరవలి తహసిల్దార్ నిరంజన్, ఉండ్రాజవరం ఎంపీడీవో ఉమా రాజ్యలక్ష్మీ పద్మజ, తహసిల్దార్ ప్రసాద్, నిడదవోలు ఎంపీడీవో జగన్నాథ్ రావు మరియు తహసిల్దార్ నాయక్ పాల్గొన్నారు. వీరితో పాటు మూడు మండలాల నీటి సంఘాల ప్రెసిడెంట్లు సురేంద్ర, పుల్లా శేఖర్, సత్యనారాయణ, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా జలవనరుల శాఖ డీఈఈ జి. మనోజ్ కుమార్, నరసాపురం ఇరిగేషన్ డీఈఈ సీహెచ్ వెంకటనారాయణ, ఇతర అధికారులు, కూటమి నాయకులు, మండలాల అధ్యక్షులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link