ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జుత్తిగ నాగరాజుకు మంత్రి కందుల దుర్గేష్ దిశానిర్దేశం.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జుత్తిగ నాగరాజు
పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన
నిడదవోలు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధి, ఆధునీకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. సోమవారం నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం తీపర్రులో జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దుర్గేష్ ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన జుత్తిగ నాగరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఆయనకు అభినందనలు తెలుపుతూ పలు కీలక సూచనలు చేశారు. గ్రంథాలయాల్లో విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు ఉపయోగపడే అత్యాధునిక పుస్తకాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా గ్రంథాలయాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా డిజిటల్ వసతులతో ఆధునీకరించాలని కోరారు.ఉండి నియోజకవర్గ జనసేన ఇంచార్జిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగరాజుకు జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గ్రంథాలయాల అభివృద్ధికి మరియు పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా జుత్తిగ నాగరాజు మంత్రి దుర్గేష్ కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.


