తణుకు నియోజకవర్గంలో కూటమి శ్రేణుల వేడుకలు
అమరావతి రాజధానికి లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం లభించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాలు మేరకు గురువారం తణుకు పట్టణంలోని స్థానిక నరేంద్ర సెంటర్‌లో కూటమి నాయకులు, కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు. కేకు కట్ చేసి బాణాసంచా కాల్చి స్వీట్లు పంచి వేడుకలు చేశారు. అనంతరం నరేంద్ర సెంటర్ నుంచి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వరకు ర్యాలీ చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇరగవరం, అత్తిలి మండలాల కేంద్రాల్లో సైతం ఈ వేడుకలు చేపట్టారు. ఆరుకోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో అమరావతి రాజధాని బిల్లుకు చట్టబద్ధత కల్పించే విధంగా కృషి చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని ప్రాంతాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ఆచరణ యోగ్యం కాని మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. తాజాగా మరోసారి మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేయాలంటూ జగన్ చేసిన ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడును నమ్మి వేలాది మంది రైతులు ముందుకు వచ్చి వ్యవసాయ భూములు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి రాజధాని బిల్లును అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ఆమోదయోగ్యం కావడానికి కృషి చేసిన తీరును అభినందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


