ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల డిగ్రీ & పీజీ (అటానమస్) ప్రాంగణంలో ఆదరణ సేవా ఫౌండేషన్ చైర్మన్ వి. ఆశాజ్యోతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్ళపూడి రేణుక మాట్లాడుతూ మహిళ అనేది ప్రేమ, ధైర్యం, సహనం, త్యాగం వంటి మహత్తర గుణాల సమాహారం అని పేర్కొన్నారు. తల్లి రూపంలో అపారమైన ప్రేమను పంచుతూ, సోదరిగా ఆదరణను అందిస్తూ, భార్యగా కుటుంబానికి అండగా నిలుస్తూ, స్నేహితురాలిగా నమ్మకాన్ని కలిగించే మహత్తరమైన వ్యక్తిత్వం మహిళదని అన్నారు. సమాజ అభివృద్ధి, దేశ పురోగతిలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆమె స్పష్టం చేసారు.
భారతదేశం మహిళా శక్తిని గౌరవించే దేశమని పేర్కొంటూ, దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వంగా నిలబెట్టిన అనేక మహిళలను ఆమె ఉదాహరణగా ప్రస్తావించారు. అంతరిక్ష రంగంలో విశిష్ట కీర్తి సాధించిన కల్పనా చావ్లా, క్రీడా రంగంలో భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన పి.వి. సింధు, మేరీ కోమ్ వంటి మహిళామణులు ప్రతి యువతికి ప్రేరణగా నిలుస్తున్నారని తెలిపారు.
అలాగే దేశ రక్షణలో మహిళలు సైతం ముందుండి సేవలందిస్తున్నారని గుర్తుచేసారు. భారత వైమానిక దళంలో యుద్ధవిమానాలను నడిపి చరిత్ర సృష్టించిన వ్యోమిక సింగ్, అవని చతుర్వేది, అలాగే ధైర్యసాహసాలతో దేశ సేవలో నిలిచిన భావనా కాంత్ వంటి మహిళలు భారత మహిళా శక్తి ప్రతీకలని అన్నారు. ప్రతి మహిళ తన కలలను నెరవేర్చుకునే అవకాశం పొందాలి, గౌరవంతో, స్వాభిమానంతో జీవించే సమాజాన్ని నిర్మించడం మనందరి లక్ష్యంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పోస్టర్ పెయింట్ ను విడుదల చేసి మహిళా అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సోషల్ యాక్టివిస్ట్ వావిలాల సరళాదేవి, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎన్.అరుణకుమారి, పశ్చిమ గోదావరి జిల్లా, బి.జె.పి. అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైబ్రరీ పరిషత్ డైరెక్టర్ శ్రీమతి కె. వైశాలి, ఎస్.కె.ఎస్.డి. మహిళా జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ శ్రీమతి బి.హెచ్. హిమబిందు, తెలుగు ఉమెన్ స్టేట్ జనరల్ సెక్రటరీ, శ్రీమతి ఎం. సాయి కళ్యాణి, డిప్యూటీ తహశీల్దార్, శ్రీమతి ఎన్. శ్రీదేవి, మరియు విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు.


