అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తణుకు ఎస్.కె.ఎస్.డి మహిళా డిగ్రీ & పీజీ (అటానమస్), ఆదరణ సేవా ఫౌండేషన్, ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు.లక్ష్మీసుందరీబాయి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారని, ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం చదువు మధ్యలో ఆపేసిన విద్యార్థినులు గుర్తించి వారిని మరల చదువుకునేలా ప్రోత్సహించి వారికి సహాయ సహకారాలు అందించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశారని తెలియజేశారు.
ఆదరణ సేవా ఫౌండేషన్- ఫౌండర్ అండ్ చైర్మన్ వి.ఆశాజ్యోతి మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని కళాశాలలో ఫీజులు చెల్లించలేక చదువు మానేసి వారి సహాయార్థం దాతల సహకారంతో ఫీజులు చెల్లించేలా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ కి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా.ముళ్ళపూడి రేణుక, (బి.జె.పి. అధికార ప్రతినిధి) మహిళలు అన్ని స్థాయిలో ముందు ఉన్నారని, విద్యార్థులకు క్రమశిక్షణ అవసరమని, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారని వారు డాక్టర్ గాను, శాస్త్రవేత్తగా అనేకరంగాలలో తమ సేవలు అందిస్తున్నారని, విద్యార్థులు చదువుతోపాటు తల్లిదండ్రులనుగౌరవించాలని, చదువే గొప్పసంపదని తెలియజేశారు.
సోషల్ యాక్టివిస్ట్ వావిలాల సరళాదేవి మాట్లాడుతూ మహిళలను గౌరవించాలని, ఆధునిక మహిళ ఇంటి బాధ్యతలతో పాటు విద్య, వైద్య, రాజకీయ రంగాలలో విధులను నిర్వహిస్తుందని అలాగే దుర్గాబాయి దేశ్ ముఖ్, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారు మహిళలకు ఆదర్శప్రాయమని, డిజిటల్ టెక్నాలజీ మీద ఆసక్తి పెంచుకోవాలని, నిత్య పుస్తకం పఠనం అవసరమని, మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకమైన సదుపాయాలు కల్పిస్తున్నాయని, మహిళలు భద్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని అలాగే విద్యావంతులుగా తయారవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పోస్టర్ పెయింట్ ని విడుదల చేసి మహిళా అధ్యాపకులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎన్.అరుణకుమారి, పశ్చిమ గోదావరి జిల్లా బి.జె.పి. అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లైబ్రరీ పరిషత్ డైరెక్టర్ శ్రీమతి కె. వైశాలి, ఎస్.కె.ఎస్.డి. మహిళా జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ శ్రీమతి బి.హెచ్. హిమబిందు, తెలుగు ఉమెన్ స్టేట్ జనరల్ సెక్రటరీ, ఎం. సాయి కళ్యాణి, డిప్యూటీ తహశీల్దార్ ఎన్. శ్రీదేవి విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు.




