తణుకు (అక్షరభూమి)
తెలుగు వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మధుర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ శ్రీమతి వావిలాల సరళాదేవి కొనియాడారు. ఎన్నో కష్టాలు పడి సంగీతం నేర్చుకుని, మధుర గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, సినీ సంగీత ప్రపంచంలో మూడు దశాబ్దాలు పైగా గానం చేసి గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందారని సరళాదేవి వివరించారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు యాభై రెండవ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం స్థానిక యన్.టి.ఆర్. మున్సిపల్ పార్కు వద్ద గల ఆయన విగ్రహం వద్ద జరిగిన సమావేశంలో శ్రీమతి వావిలాల సరళాదేవి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇక్కడ ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహాన్ని గతంలో వావిలాల రమేష్ సరళా దేవి దంపతులు ఏర్పాటు చేశారు.
తొలుత శ్రీమతి వావిలాల సరళాదేవి, ప్రముఖ గాయకుడు ఆకుమర్తి రాజు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పుష్పమాలలు అలంకరించగా, గాయకులు, ఆయన అభిమానులు పుష్పాంజలి ఘటించి జోహార్లు అర్పించారు.
ఈ సందర్భంగా గాయకులు ఆకుమర్తి రాజు, కోట రామ ప్రసాద్, ఎస్. దొర బాబు, ఈ. సత్యనారాయణ, అర్జి భాస్కర రావు, యం.శ్రీనివాస్, యం.విజయ్ కుమార్
ప్రభృతులు ఘంటసాల పాటలు పాడి ఆహూతులను అలరించారు.


