ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే వేదికగా “అరకు ఉత్సవ్–2026”

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో “అరకు ఉత్సవ్–2026″ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారితో కలిసి వైభవంగా ప్రారంభించటం సంతోషంగా ఉంది. ఈ ఉత్సవం మన గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలకు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చే వేదికగా నిలుస్తుందని విశ్వసిస్తున్నాను.

ఈ సందర్భంగా లంబసింగిలో టెంట్ సిటీ, మారేడుమిల్లిలో గిరిజన హోమ్‌స్టేల అభివృద్ధి వంటి కీలక పర్యాటక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. స్థానిక కళాకారులను సన్మానించి, వారి ప్రతిభకు గౌరవం కల్పించాం. రాబోయే పదేళ్లలో “ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉపాధి” లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము.

పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా బొర్రా గుహలను రూ. 29.88 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్నాం. అలాగే అరకు, మయూరి, తైడ జంగిల్ బెల్స్ హరిత రిసార్ట్స్ ఆధునీకరణకు రూ. 42.30 కోట్లు వెచ్చిస్తూ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తున్నాం. ఎకో టూరిజం ద్వారా గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకుంటున్నాం.

అరకు అందాలు, లోయలు, చల్లని వాతావరణం ప్రతి పర్యాటకుడికి మధుర అనుభూతిని ఇస్తాయి. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా అరకు ఉత్సవ్ కొనసాగుతూ, రాష్ట్ర పర్యాటక వైభవాన్ని చాటుతోంది. ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ సంకల్పం అని తెలియజేస్తూ అరకు ఉత్సవ్‌ను ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.

Scroll to Top
Share via
Copy link