అభివృద్ధి పథంలో ఆదర్శంగా నిలుస్తున్న సొసైటీ
తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
రైతులకు రూ. 32.35 వడ్డీ రాయితీ, డివిడెంట్ అందజేత
సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ నాగరాణి
ఆర్థిక క్రమశిక్షణతో రైతులకు సేవలు అందిస్తున్న తణుకు మండలం వేల్పూరు సొసైటీ ఆదర్శంగా నిలుస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. కేవలం రైతులకు సేవలు అందించడమే కాకుండా పాలు, ఎరువుల విక్రయాల ద్వారా సొసైటీ లాభాల బాటలో పయనిస్తుందని అన్నారు. వేల్పూరు సొసైటీ పరిధిలో డివిడెంట్, మూడు శాతం వడ్డీ రాయితీ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొని రైతులకు రూ. 32.35 లక్షలు వడ్డీ రాయితీ, డివిడెంట్ అందజేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోనే ఒక ఉత్తమ సొసైటీగా వేల్పూరు సొసైటీ నిలుస్తూ పలు స్థిరాస్తులను కలిగి ఉందని చెప్పారు. దాదాపు 50 సంవత్సరాల నుంచి గ్రామంలో రైతుల సహకారంతో ఆర్మీల వెంకటరత్నం అందించిన సహకారంతో నేటికీ గ్రామ అభివృద్ధికి కృషి జరుగుతోందని అన్నారు. వేల్పూరు గ్రామంలో సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సైతం వేల్పూరు గ్రామ అభివృద్ధిలో నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదని పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయంలో ధాన్యం బకాయిలు పెట్టి వెళ్లిపోయిన జగన్మోహన్ రెడ్డి రైతులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. దాదాపు రూ. 1600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లిపోతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు చెల్లించిన విషయం గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో రైతులను అవహేళన చేసే వారిని దుర్భాషలాడిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తులో తిరగనివ్వబోరని అన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా రైతులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాకు సంబంధించి యూరియా కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లాలోని రైతులు యూరియా వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సొసైటీ అధ్యక్షులు పెనుమర్తి మోహన్ తణుకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ, పంచాయితీ మాజీ సర్పంచ్ పెనుమర్తి సోమ సూర్యచంద్రరావు, గ్రామ సర్పంచ్ విశ్వనాథం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.


