భక్తుల భజనపై ఆంక్షలు సీతారామాంజనేయ స్వామి ఆలయపాలక వర్గంపై ఆరోపణలు

భక్తుల భజనకు అడ్డంకులు తణుకు సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వివాదాస్పద నిబంధనలు
సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే ఆలయంలోనే భక్తుల భజనకు అడ్డంకులు ఏర్పడటం తీవ్ర ఆవేదనకు దారి తీస్తోంది. తణుకు పట్టణంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం లో ఇటీవల అమలవుతున్న కొన్ని నిబంధనలు భక్తులను తీవ్రంగా కలచివేస్తున్నాయి.ఆలయంలో రామ భజన చేయాలంటే భజన చేసినవారే ఒక వారం రోజుల ప్రసాదం ఏర్పాటు చేయాలనే ఆంక్ష విధిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఆలయంలో భజన చేస్తే కరెంటు బిల్లు వస్తుందని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వాపోతున్నారు. భజన సమయంలో కుర్చీలు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించరాదని, తప్పనిసరిగా నేలపై కూర్చునే భజన చేయాలంటూ సూచనలు ఇస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ఆవేదన కలిగించే విషయం ఏమిటంటే 50 సంవత్సరాల పైబడిన మహిళలు సైతం నేలపై కూర్చునే భజన చేయాలనే ఆంక్షలు విధిస్తున్నారని భక్తులు చెబుతున్నారు. ఈ తరహా నియమాలు భజన అనే భక్తి ప్రక్రియను నియంత్రించేలా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తిన భక్తులపై స్పందన లేకపోవడంతో, శుక్రవారం ఆలయ తలుపులు మూసివేయడంతో భక్తులు నడిరోడ్డుపై రామ భజన నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సనాతన ధర్మం పుట్టిన భారతదేశంలో, అదీ ఒక పట్టణ కేంద్రంలో, భక్తులు రోడ్డుపై కూర్చుని భజన చేయాల్సి రావడం బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారానికి ఆలయ చైర్మన్‌ కారణమా? లేక అధికారులకు ఈ విషయాలు తెలియవా? అనే సందేహాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ అంశం స్థానిక అధికారులకూ, ఎమ్మెల్యే దృష్టికీ వెళ్లిందని, “అయిపోతుంది” అని చెప్పి మళ్లీ యథావిధిగా కొనసాగించడం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తుల విశ్వాసాలు, ఆచారాలను గౌరవించాల్సిన ఆలయ పరిపాలన వ్యవస్థ ఇలాంటి ఘటనలపై వెంటనే స్పందించి, భజనలకు అడ్డంకులు తొలగించాలని, ఆలయ పవిత్రతను, సనాతన ధర్మ గౌరవాన్ని కాపాడాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Scroll to Top
Share via
Copy link