రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

:- మంత్రి కందుల దుర్గేష్

వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన ఏఎంసీ నూతన పాలక వర్గంతో తొలి కమిటీ భేటీ

వ్యవసాయ మార్కెట్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతాంగం సమస్యల పరిష్కారానికి ఏఎంసీ కృషి చేయాలని సూచన

నిడదవోలు: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వ్యవసాయ మార్కెట్ లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, రైతాంగం సమస్యల పరిష్కారానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన 5వ సాధారణ వ్యవసాయ మార్కెట్ కమిటీ సమావేశం జరగగా ఇటీవల ఏర్పాటైన నూతన పాలక వర్గంతో తొలి భేటీ ఇదే. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ ఇంచార్జ్, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, ఏఎంసీ ఛైర్మెన్ గాలింకి జిన్నా బాబు, వైస్ ఛైర్మన్ పువ్వల రతీదేవి, సభ్యులు కోరశిఖ వెంకటేశ్వరరావు, మారిశెట్టి మీనాక్షి, నల్లూరి అరుణ, పోతబత్తుల శ్రీనివాసరావు, వాకా సత్యనారాయణ, కడలి హేమలత, దిద్దే అరుణకుమారి, దాసం సూర్య సుబ్రహ్మణ్యం, సంగీత పార్వతీదేవి, కాసకాని సతీష్, దేవళ్ల సత్య శైలజ, కారుమూరి శేషబాబు, హనుమంతు వెంకన్న తదితరులు హాజరైన ఈ సమావేశంలో మంత్రి దుర్గేష్ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీకి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రైతులకు అందాల్సిన సౌకర్యాలు, మార్కెట్ నిర్వహణలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై సభ్యులతో సుదీర్ఘంగా చర్చించి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. గత సమావేశం తీర్మానాలను వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీలు రైతుల ప్రయోజనాలే కేంద్రంగా పనిచేయాలని, నిబంధనలకు లోబడి పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎక్స్ అఫీషియో ఛైర్మన్ గా ప్రభుత్వానికి, కమిటీకి మధ్య వారధిగా తాను నిలబడతానని భరోసానిచ్చారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో లక్ష్యానికి మించి ధాన్యం సేకరించి రైతాంగానికి మేలు చేశామన్నారు.కేవలం 48 గంటల్లోనే రైతుల నుండి సేకరించిన ధాన్యానికి ఖాతాలో నగదు జమ చేశామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం బకాయిపెట్టిన రూ.1684 కోట్ల ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వమే చెల్లించిందన్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రైతాంగానికి చేస్తున్న మేలును, పథకాలను వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యకలాపాల్లో పారదర్శకత, క్రమశిక్షణతో పాటు రైతులకు మరింత మేలు చేకూరేలా చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ కమిటీ సభ్యులతో అన్నారు. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఏఎంసీ పనిచేయాలని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

Scroll to Top
Share via
Copy link