రైతాంగ సమస్యలకు సంపూర్ణ సహకారం అందిస్తాం
:మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు రూరల్ మండలం సురాపురంలో 166 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు
నిడదవోలు నియోజకవర్గంలో రీసర్వే చేసి 13,477 పట్టాదారు పాస్ పుస్తకాలు క్రమపద్ధతిలో రైతులకు అందించే బాధ్యత తమదని హామీ
పాస్ బుక్ లు రాని రైతులు ఆందోళన చెందవద్దని, రీసర్వే అనంతరం అందిరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తామని భరోసా
నిడదవోలు: రైతులకు రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి వారి హక్కులను పరిరక్షించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే దక్కుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం నిడదవోలు రూరల్ మండలం సురాపురంలో మంత్రి కందుల దుర్గేష్, ఏపీఎస్ఎస్ డీసీ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు లు 166 మంది రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొత్త పట్టదారు పాస్ పుస్తకాన్ని వేదికపై నిలబడి రైతాంగానికి చూపించారు.కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి (జనవరి 2 నుండి) వారం రోజుల పాటు నిర్వహించనున్నామన్నారు. అందులో భాగంగా నిడదవోలు మండలంలో 6900కు పైగా, ఉండ్రాజవరం మండలంలో 3వేల పైచిలుకు, పెరవలి మండలంలో 2000కు పైగా మొత్తంగా నిడదవోలు నియోజకవర్గం వ్యాప్తంగా రీసర్వే చేసి 13,477 పట్టాదారు పాస్ పుస్తకాలు క్రమపద్ధతిలో రైతులకు అందిస్తామన్నారు. ప్రజల మధ్య ఉండి రెవెన్యూ సమస్యలతో పాటు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, స్వామిత్వ, గ్రామసభలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ వల్ల రైతన్నలకు తమ భూములపై పూర్తి హక్కులు వస్తాయన్నారు.పాస్ బుక్ లో పొలానికి సంబంధించిన సర్వే నంబర్లు, సరిహద్దులు, విస్తీర్ణం సరిగా ఉన్నాయో లేదో రైతులు గమనించాలని సూచించారు. ఎవరికైనా తమ పాస్ పుస్తకంలో హెచ్చు తగ్గులు, లోపాలేమైనా ఉంటే సత్వరమే అధికారులతో చర్చించి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. అధికారులు సైతం త్వరితగతిన పరిష్కారం చూపించాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఆదేశించారు. అలా జరగని పక్షంలో రైతులకు అండగా నిలబడి న్యాయం చేసేందుకు తాముంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. మన నాన్న, తాతలు సంపాదించిన ఆస్తిపై ఎవరి ఫోటోలు ఉంటే ఎలా అని అది మన కర్మ అని మండిపడ్డారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో అధికారికంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తోందన్నారు. తద్వారా ప్రభుత్వ అనుమతికి నిదర్శనంగా పాస్ పుస్తకాలు ఉండనున్నాయన్నారు. సంబంధిత భూమిలో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలన్నా, అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టాలన్నా, లోన్ పొందాలనుకున్నా పట్టాదారు పాస్ పుస్తకం అనేది రైతుకు తప్పనిసరి అన్నారు. ఇదొక రాజపత్రం అని పేర్కొన్నారు.
తాత నుండి వారసత్వపు ఆస్తిగా తన చిన్నాన్నకు, తనకు జంగారెడ్డి గూడెంలో భూమి వచ్చిందన్నారు. అందులో తన వాటాగా 5 ఎకరాల పొలం వచ్చిందన్నారు. తమ చిన్నాన్నకు ఆన్ లైన్ లో వివరాలు అన్ని పరిష్కరించబడి సంబంధిత బుక్ కూడా వచ్చిందన్నారు. తన పొలానికి వచ్చే సరికి వారసత్వంగా వచ్చిన ఆస్తితో పాటు భూమి, అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ ఆన్ లైన్ అవ్వడం లేదని వివరించారు. సాంకేతిక కారణాలు చూపించి అవ్వడం లేదన్నారు. టెక్నికల్ అంశాలు సరిదిద్ది రీసర్వే చేశాకనే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని గత రెండేళ్లుగా అధికారులు చెబుతున్నారని మంత్రి దుర్గేష్ రెవెన్యూ సమస్యలను ఉదహరించారు. ఇలాంటి అంశాలను సరిదిద్దాల్సిన అవసరముందని అధికారులకు చెప్పారు. ఇలాంటి సమస్యలను క్రమబద్ధీకరించడానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. దీంతో పాటు స్వామిత్వ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామ కంఠంలోని ఇళ్లు, భూములు అన్యాక్రాంతం ఉండకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 22ఏ క్రింద రిజిస్టర్ అయిన భూములు క్రయవిక్రయాలు జరగకుండా ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో దీనిపై సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ లో 22ఏ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి వెంటనే సంబంధిత సమస్యను పరిష్కరించి న్యాయబద్ధంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారన్నారు. ఇప్పటికే ఈ అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరులో సమావేశం నిర్వహించి ఒకే రోజులో వందలాది సమస్యలకు పరిష్కారం చూపారని గుర్తుచేశారు.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. బ్రిటీష్ కాలం నాటి రెవెన్యూ రికార్డులు, తదనంతరం వచ్చిన ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు తదితర కారణాల వల్ల రెవెన్యూలో సమస్యలు పేరుకుపోయి ఇబ్బందులు తలెత్తాయన్నారు. నేటికీ భూములకు సంబంధించిన సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో వీటన్నింటికి చెక్ పెట్టి సమస్యలు పరిష్కరించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రైతులకు న్యాయబద్ధంగా వచ్చిన పొలాలు వారికి దఖలు పరిచేలా పూర్తిస్థాయిలో కృషి చేయాలని ప్రతి కేబినెట్ లో సీఎం చంద్రబాబునాయుడు తమకు సూచించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు.
పంటికింద రాయిలా, కంటికింద నలుసులా రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని వాటన్నింటికి త్వరితగతిన పరిష్కారం చూపిస్తామన్నారు.రైతులు ఏ రకమైన ప్రలోభాలకు లోనవ్వద్దని మంత్రి దుర్గేష్ సూచించారు. నియోజకవర్గంలో దాదాపు 95 శాతం చిన్నకారు రైతులే ఉన్నారని, వీరికున్న కమతాలు తక్కువేనని ఈ క్రమంలో కచ్చితత్వంతో కూడిన పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తనతో పాటు బూరుగుపల్లి శేషారావు రైతులకు అండదండలుగా ఉంటామని హామీ ఇచ్చారు. సురాపురం గ్రామంలో ఇంకా ఎవరికైనా పాస్ పుస్తకాలు రాకపోతే ఆందోళన చెందవద్దని, అందరికీ అందించే ఏర్పాటు చేస్తామని భరోసానిచ్చారు. న్యాయబద్దంగానే ముందుకు వెళ్ళి సమస్యల పరిష్కారానికి చొరవ చూపించాలని ఈ క్రమంలో మంత్రిగా తన ఒత్తిడి ఎవరిపై ఉండదని సంపూర్ణ సహకారం అందిస్తానని అధికారులకు చెప్పారు. రైతాంగాన్ని కాపాడాల్సిన బృహత్తర బాధ్యత అందరిపై ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు.
2025 కన్నా 2026న ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చే ప్రజల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా కూడా సూపర్ సిక్స్ కార్యక్రమాలు విజయవంతం కావడం, ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగడమే ఇందుకు కారణమన్నారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల అమలు తీరును, లబ్ధిదారులకు అందుతున్న లబ్ధిని మంత్రి దుర్గేష్ వివరించారు.ఈ సందర్భంగా నేరుగా లబ్ధిదారుల అభిప్రాయాన్ని సభాముఖంగా అడిగారు. అందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని, చిల్లిగవ్వ కూడా మిగల్చేదని మంత్రి దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్త్రీశక్తి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ తదితర సాహసోపేత పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాలోకేష్, సహచర మంత్రులు అందరం కలిసి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే నిడదవోలు నియోజకవర్గానికి అత్యధికంగా రూ.28 కోట్ల నిధులు గ్రామీణ రహదారులకు కేటాయించడం గర్వించే విషయమన్నారు. ఇందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత రూ.11 కోట్లు, ఎంపీ ల్యాడ్స్ నుండి రూ.1 కోటి, పల్లె పండుగ 2లో రూ.7 కోట్లు తెచ్చామన్నారు. ప్రస్తుతం రూ.28 కోట్లతో అంచనా తయారు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల సమస్య లేకుండా లింక్ రోడ్ల నిర్మాణాలు సైతం చేపడుతామన్నారు. గత ప్రభుత్వం గ్రామీణ రోడ్లను,ఆర్ అండ్ బీ రోడ్లను, జెడ్పీ రోడ్లను పట్టించుకోకపోగా గుప్పెడు మట్టి కూడా వేయలేదని విమర్శించారు. వారికి రోడ్ల విషయంలో విమర్శించే అర్హతే లేదన్నారు. రూ.27 కోట్లతో ప్రత్యేకంగా ఆర్ అండ్ బీ రోడ్లు వేయించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా చివటం- ఉసులుమర్రు,కానూరు-ఉసులుమర్రు, డి ముప్పవరం – కానూరు వెళ్లే రహదారులను నిర్మిస్తున్నామన్నారు. ప్రతిపాదనలు పెట్టండి ఆర్థికశాఖతో మాట్లాడి నిధులు తెచ్చే బాధ్యత తనదని అధికారులకు చెప్పానన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ అలసత్వం వల్ల అధ్వాన్నస్థితికి చేరిన డి ముప్పవరం నుండి పెరవలి రోడ్డుకు బాగుచేయించే బాధ్యత తనదన్నారు. అదే విధంగా రూ.30 కోట్లతో నియోజకవర్గంలో రహదారులు బాగు చేయిస్తామన్నారు.నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానన్నారు. ఇటీవల రుడా నుండి రూ.86 లక్షలు తీసుకువచ్చి నిడదవోలు పట్టణాభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. దాదాపు రూ.400 కోట్లతో నిడదవోలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ బూరుగుపల్లి శేషారావు, స్థానిక సర్పంచ్, ఎమ్మార్వో, ఎండీవో, కూటమి నాయకులు, నియోజకవర్గ మండలాల అధ్యక్షులు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


