ప్రచార యావ తప్ప అభివృద్ధి, సంక్షేమం శూన్యం
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విమర్శలు
కోనాల గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ పథకంలో చూసినా వైయస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకునే వారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. శుక్రవారం తణుకు మండలం, కోణాల గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కనీసం సరిహద్దు రాళ్ళను సైతం విడిచిపెట్టకుండా జగన్ మోహన్ రెడ్డి బొమ్మలు వేయించుకునే వారిని ఎద్దేవా చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి బొమ్మల కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు పెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాలు, సర్వే రాళ్లపైన తన బొమ్మలు వేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మగౌరవం నిలబడే విధంగా అధికారికంగా రాజముద్రం వేసి రైతులకు అందజేయడం జరుగుతుందని చెప్పారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన రైతులను దుర్భాషలాడి వారిపై దౌర్జన్యం చేసిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరాచక పాలన చేశారని విమర్శించారు. సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నిస్తే ఎదురు దాడి చేసే పరిస్థితి గతంలో ఉండేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమ అధ్యయంగా పనిచేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఎం ఆవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఉజ్వల 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామదర్శిని కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానికుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి అక్కడికక్కడే పరిష్కరించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


