త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం
త్వరలోనే నిడదవోలు నుండి పెరవలి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ
నిడదవోలు : నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఎన్ హెచ్ 5 నుండి చివటం వెళ్లే ప్రధాన రహదారి సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు.రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ రహదారి నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దాన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు, వాహనదారులకు అందుబాటులో తీసుకురావాలని అధికారులకు సూచించారు. రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ రహదారిని 6 మీటర్ల వెడల్పు చేయాలని, అడ్డుగా ఉన్న కరెంటు స్తంభాలను తొలగించాలని ప్రజల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకొని ఆ దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి దుర్గేష్ అధికారులకు సూచించారు. ఇప్పటివరకు ఎన్ హెచ్ 5 నుండి చివటంలోని గమని టెక్స్ టైల్ వరకు పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం వెనకడుగు వేయదన్నారు. త్వరలోనే నిడదవోలు నుండి పెరవలి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తమ విధానమని, దాని ప్రకారం అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామన్నారు.


