:- మంత్రి కందుల దుర్గేష్
భవిష్యత్ తరాలు, పట్టణాభివృద్ధికి స్పష్టమైన ప్రణాళికతో నిడదవోలు పురపాలక సంఘం ముందుకెళ్లాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచన
మంత్రి కందుల దుర్గేష్ రాజకీయాలకి అతీతంగా పనిచేసే వ్యక్తిని తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్
నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి 100 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందేందుకు పూర్తి సహకారం అందిస్తామని వెల్లడి
నిడదవోలు: నిడదవోలు సమగ్ర స్వరూపాన్ని మార్చి కళా, సాంస్కృతిక వైభవాన్ని తీసుకొస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్థానిక లయన్స్ క్లబ్ లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం రూ. 80 లక్షల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి నాదెండ్ల మనోహర్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పాటై 60 వసంతాలు గడిచిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవడం ముఖ్యమైన ఘట్టంగా అభివర్ణించారు. ఈ క్రమంలో నిరవద్యపురం నిడదవోలుగా రూపాంతరం చెందిన విధానాన్ని, ప్రస్థానాన్ని వివరించారు. శ్రీ నంగాలమ్మ తల్లి, శ్రీ కోట సత్తెమ్మ తల్లి ఆశీస్సులు పట్టణంపై, ప్రజలపై మెండుగా ఉన్నాయని ఆ గ్రామ దేవతలే తమ పట్టణాన్ని కాపాడుతున్నారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ముస్లిం, మైనార్టీలు ఎక్కువగా ఉన్న నిడదవోలులో మసీదులు, చర్చిలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయని, ఆ ఔన్నత్యాన్ని కాపాడదామని పిలుపునిచ్చారు.
అమృత్ పథకం ద్వారా నిడదవోలు ప్రజలకు పైపుల ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. చినకాశి రేవు వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్నారు. వచ్చే ఏడాది జూన్ నాటికి నిడదవోలు పట్టణంలో 1152 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు పూర్తిస్థాయిలో అన్ని మౌలిక వసతులతో అందిస్తామని స్పష్టం చేశారు.
సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలలు ఉండగా ప్రగల్భాలు పలికిన గత ప్రభుత్వ నేతలు ప్రజలను మభ్య పెట్టేలా శిలాఫలకాలు వేసి మమ అనిపించారని, కానీ తాము పరిపాలన, ఆర్థిక అనుమతులతో కూడిన వంద పడకల ఆసుపత్రిని నిర్మించి తీరుతామని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. నాడు నాబార్డ్ నుంచి రూ. 19 కోట్లు లోన్ తెస్తున్నామని చెప్పి శిలాఫలకం వేశారు. కానీ మ్యాచింగ్ గ్రాంట్ కింద మూడు నెలల్లో నాడు రాష్ట్ర ప్రభుత్వం రూ. 4 కోట్లు ఇవ్వకపోవడంతో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందని గుర్తు చేశారు. తాము మొత్తంగా రూ.23 కోట్లకు ప్రతిపాదనలు తయారు చేశామని, కూటమి ప్రభుత్వ హయాంలోనే నిడదవోలు లోని 30 పడకల ఆసుపత్రి వంద పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందుతుందని స్పష్టం చేశారు.ఈ అంశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, వేదిక ఏదైనా తాను చర్చకు సిద్ధమని ప్రతిపక్షానికి సవాల్ విసిరారు. అదేవిధంగా పట్టణం, నియోజకవర్గం లో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి శాయశక్తుల కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం అమృత్, జలజీవన్ మిషన్ నిధులు దారి మళ్ళించిందని తద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం సంబంధిత పథకాల రూపేణా వచ్చే నిధులను అభివృద్ధికి వినియోగిస్తుందని తెలిపారు. నిడదవోలు పట్టణంలో రహదారులతోపాటు మార్కెట్ యార్డ్ నిర్మాణం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపడతామన్నారు. ప్రస్తుతం శంకుస్థాపనలు చేసుకున్న పనులన్నీ పూర్తయితే నిడదవోలు పట్టణం సర్వాంగ సుందరంగా మారుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వపు ధాన్యం బకాయిలు రూ. 1600 కోట్లను చెల్లించామన్నారు. టిడ్కో గృహాల కింద బకాయి పెట్టిన రూ. 140 కోట్లు చెల్లించమన్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో రైతన్న ఆరుగాలం కష్టించి పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసి కేవలం నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ హామీలు అమలు తీరును, లబ్ధిదారులకు అందిస్తున్న లబ్ధిని మంత్రి దుర్గేష్ స్పష్టంగా వివరించారు. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని మంత్రి దుర్గేష్ ప్రజలను కోరారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ భవిష్యత్ తరాల గురించి, నిడదవోలు పట్టణాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల గురించి కౌన్సిల్ సమావేశాల్లో చర్చించుకోవాలని పురపాలక సంఘానికి సూచించారు. నిడదవోలులోని ఆస్పత్రి 100 పడకల ఆసుపత్రిగా రూపాంతరం చెందేందుకు తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. నిడదవోలులో రోడ్లతోపాటు ఎల్ఈడి లైటింగ్ పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టణ ప్రజలకు భద్రత కల్పించడం తో పాటు ట్రాఫిక్ డైవర్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. నిడదవోలు పురపాలక సంఘానికి ఏట వచ్చే రూ.10 కోట్ల ఆదాయాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ సుందరీకరణ పై శ్రద్ధ వహించాలన్నారు. ప్రజలు ఇందులో భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు. పర్యావరణానికి పెద్దపీట వేస్తూ తడి పొడి చెత్త సేకరించాలన్నారు. రాబోయే వందేళ్ళకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి
కేంద్ర ప్రభుత్వంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల కృషి పట్టుదలకు ప్రజలు మరింత సహకారం అందించాలన్నారు. తాను తెనాలికి రూ. 100 కోట్లతో కృష్ణా జలాలు తెచ్చిన విధంగానే మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు నియోజక వర్గానికి గోదావరి జలాలు తీసుకొస్తారని భరోసానింపారు. చరిత్ర కలిగిన నిడదవోలును మంత్రి కందుల దుర్గేష్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. మంత్రి కందుల దుర్గేష్ పట్టుదలతో పని చేసే వ్యక్తి అని, రాజకీయాలకతీతంగా పాటుపడే వ్యక్తి అని మంత్రి నాదెండ్ల మనోహర్ అభివర్ణించారు.


