పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం, నవంబర్ – 13
ఆన్లైన్లో ఇటీవల నకిలీలు బెడద ఎక్కువయ్యింది. విద్యావంతులే నకిలీల ఉచ్చులో పడిపోతున్నారు. చదువు లేనివారికన్నా అధికంగా ఈ రకమైన ట్రాప్ లో . ప్రభుత్వఅధికారులు సైతం మోసపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ మొదటివారంలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఎ. సి. బి. దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులు రాష్ట్రవ్యాప్తంగా సంచలన మయ్యాయి . దీనిని ఆసరాగా తీసుకున్న ఆన్లైన్ కేటుగాళ్లు పశ్చిమ గోదావరి జిల్లాలోని కొంతమంది సబ్ రిజిస్ట్రార్ లకు ఎ. సి. బి. అధికారుల మంటూ ఫోన్ చేసి ట్రాప్ లో దింపే ప్రయత్నాలుగా వీరివలలో మొగల్తూరు సబ్ రిజిస్ట్రార్ సబ్బితి శ్రీనివాస్ చిక్కారు. బుధవారం ఆయనకు ఎ. సి. బి. కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని, మొగల్తూరు కార్యాలయంలో ఆకస్మిక దాడులు జరగనున్నాయని ఒక వ్యక్తి ఫోన్ చేసి బెదిరించగా, ఆయన ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. రైడ్ జరగకుండా ఉండాలంటే మూడులక్షలు బ్యాంకు ఖాతాకు తక్షణమే బదిలీ చేయాలని హుకుం జారీ చేశాడు. సబ్ రిజిస్ట్రార్ ఎ. సి. బి. కార్యాలయం నుంచే ఫోన్ వచ్చింది అనుకుని ఆయన బ్యాంక్ ఖాతా నుంచి రూ లక్ష , ఇతరులు ఖాతా నుంచి కొంత కొంతగా మరో రూ లక్ష ను నకిలీల ఖాతాలోకి బదిలీ చేశారు. మిగతా సొమ్ము రూ లక్ష కూడా ఇప్పుడే ట్రాన్సఫర్ చేయమని గట్టిగా అడగడంతో ఆయనకు కొంత అనుమానం వచ్చి తెలిసిన వారిని సంప్రదించారు. ఎ. సి. బి. కార్యాలయం నుంచి ఫోన్ చేయలేదని, అలా జరగదు కూడా అని చెప్పడంతో నకిలీలు చేతిలో మోసపోయినట్లు గ్రహించారు. వెంటనే మొగల్తూరు పోలీస్ స్టేషన్ లో సబ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సొమ్ము బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేశారు. విచారణ చేయగా అనంతపురం బ్యాంకు ఖాతాకు రూ లక్ష బదిలీ అయినట్లు తెలిసింది. మరో రూ. లక్ష జమ అయిన ఖాతాలపై పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది ఉలిక్కి పడ్డారు. అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.


