కూటమి హయాంలోనే పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు
ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన
ఇప్పుడు ముసలి కన్నీరు కార్చుతున్న జగన్మోహన్ రెడ్డి
మీడియా సమావేశంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిపిపి విధానంతో మన రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 220 మెడికల్ సీట్లు కేటాయించడం జరిగిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలతో గత ఐదేళ్ల కాలంలో అన్ని రంగాలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన కారణంగా నేడు కూటమి ప్రభుత్వం నిధుల కొరత ఎదుర్కొంటుందని చెప్పారు. ఉన్న కొద్దిపాటి నిధులు రెండేళ్లలో మెడికల్ కాలేజీలకు ఖర్చు చేస్తే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కోత పడదా అనే ప్రశ్నించారు. జగన్ పాలనలో వైద్య ప్రమాణాలు పదో స్థానానికి దిగజారింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఐదేళ్ల కాలంలో 17 మెడికల్ కళాశాలలు నిర్మించామని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతో రెండేళ్లలోనే 1750 మెడికల్ సీట్లు పొందే అవకాశం లభించిందని చెప్పారు. ఫీజులు, రిజర్వేషన్లకు ప్రభుత్వ విధానాలే కొనసాగుతాయని పేర్కొన్నారు. 1995 -2004 మధ్యకాలంలో చంద్రబాబు ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, రెవెన్యూ డివిజన్ కు ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో 18 ప్రైవేటు రంగంలో 18 మొత్తం 36 మెడికల్ కాలేజీలు మన రాష్ట్రంలో నడుస్తున్నాయని చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో పేద విద్యార్థులు ఎక్కువమంది వైద్యులు కాగలిగారని అన్నారు. గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సగం సీట్లు ప్రైవేటుకు కేటాయించారని చెప్పారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా చేసిందేమీ లేదని… మెడికల్ కాలేజీల సీట్లు ప్రైవేటీకరించిన జగన్ నేడు ముసలి కన్నీరు కార్చుతున్నారని ఎద్దేవా చేశారు. పిపిపి విధానంలో కేంద్ర కోటాలో 15% ఇతర రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పనిలేదని అన్నారు. మెడికల్ కాలేజీలు నిర్మాణాలకు రాష్ట్రం నిధులను జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ముఠా అబద్ధపు ప్రచారాలతో అలజడి చేస్తూ రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రను తిప్పి కొట్టి స్వర్ణాంధ్రను సాధించుకుని తెలుగువారు దేశంలో అగ్రస్థానంలో నిలబడాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


