ఇల్లు లేని నిరుపేదల కలలు సాకారం చేసేందుకు కూటమి కృషి
తేతలిలో గృహప్రవేశాలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ
ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే క్రమంలో గత ప్రభుత్వంలోని పెద్దలు ఇళ్ల స్థలాలు పేరుతో దోపిడీకు పాల్పడ్డారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. బుధవారం తణుకు మండలం తేతలి గ్రామంలో నిర్మించిన నివాసాలకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గృహప్రవేశం చేసి మాట్లాడారు. 2024 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం నిధులు కేటాయించి డబ్బులు చెల్లించి ఇళ్ళు నిర్మాణానికి చర్యలు తీసుకుందని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదల కలలు నెరవేర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఇళ్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 800 కోట్లు మేర గత ప్రభుత్వ బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు జగనన్న కాలనీల పేరుతో నిలువు దోపిడీ చేశారని విమర్శించారు. కాలనీలో కనీసం సదుపాయాలు కల్పించకుండా స్థలాల సేకరణలో కుంభకోణాలకు పాల్పడి ఇళ్ల స్థలాల కేటాయింపులో దోపిడీకు పాల్పడ్డారని ఆరోపించారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో సెంటున్నర చొప్పున ఇళ్లస్థలాలు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సెంటుకు మాత్రమే పరిమితం చేశారని అన్నారు. గత వైసిపి ప్రభుత్వం హయాంలో పేదలకు ఇచ్చిన స్థలాలను అమ్ముకుని కాలనీల్లో కనీసం సదుపాయాలు కల్పించలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను పునరావృతం చేయకుండా కాలనీలో మెరుగైన సదుపాయాలు కల్పించేలా కోటమీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు చొప్పున కేటాయించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇంటి స్థలాలు అవసరమైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతుందని రాధాకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


