అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం
నిడదవోలు పట్టణంలో జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిడదవోలు పట్టణంలో రూ.184.74 కోట్లతో శరవేగంగా జరుగుతున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్వోబీ నిర్మాణ మ్యాప్ ను సునిశితంగా చూశారు. పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడగగా 65 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం డ్రైన్ వర్క్స్ జరుగుతున్నాయని, అనంతరం సర్వీస్ రోడ్ల నిర్మాణం చేపడతామని అధికారులు తెలుపగా పనుల్లో జాప్యం లేకుండా మిగిలిన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆర్వోబీ నిర్మాణాన్ని నాణ్యతతో నిర్మించి నిడదవోలు నియోజవర్గ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలతో ఆర్వోబీ సకాలంలో అందుబాటులోకి వస్తుందని, కొన్నేళ్లుగా నిత్యం పడుతున్న కష్టాలకు తెరపడుతుందని, ప్రయాణం సుగమం అవుతుందని ప్రజలు, వాహనచోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


