తణుకు పట్టణ సీఐ కొండయ్య
తణుకులో పోలీసు సంస్మరణ దినం
నిరంతరం సమాజ రక్షణలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులు సదా చిరస్మరణీయులని తణుకు పట్టణ సీఐ ఎన్.కొండయ్య అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకు పట్టణ ప్రధానకూడలి నరేంద్ర సెంటర్లో ఏర్పాటు చేసిన సంస్మరణ సభాకార్యక్రమంలో సీఐ కొండయ్య మాట్లాడుతూ దేశం కోసం, రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసులు చిరస్మరణీయులన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకులో సర్కిల్ పరిధిలోని పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం నరేంద్ర సెంటర్లో సంస్మరణ స్థూపం వద్ద విధినిర్వహణలో అమరులైన పోలీసు సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ ఎస్సై కె.ప్రసాద్, ఇరగవరం ఎస్సై జానా సతీష్, ట్రాఫిక్ ఎస్సై డి.ఆదినారాయణ, ఏఎస్సైలు సత్యనారాయణ, శ్రీధర్, రాజ్యలక్ష్మి, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


