తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
పండుగలా జిల్లా స్థాయి యువజనోత్సవాలు
రాబోయే నాలుగేళ్లలో యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. యువజన సర్వీసుల శాఖ, సెట్‌వెల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి యువజనోత్సవాలు శుక్రవారం తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ఏర్పాటుతోపాటు టెక్నాలజీను అభివృద్ధి చేసే దిశగా ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే విశాఖపట్టణంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విశేష కృషి చేశారని గుర్తు చేశారు. యువత ప్రతి అంశాన్నీ సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతస్థాయికి రావాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా శారీరక, మానసిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. సెట్‌వెల్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె.ఎస్.ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ చిట్టూరి సత్య ఉషారాణి, జాయింట్ సెక్రటరీ చిట్టూరి వెంకటకృష్ణారావు, కళాశాల ప్రిన్సిపాల్ యు.లక్ష్మిసుందరీబాయ్, నాయకులు వావిలాల సరళాదేవి, కొండేటి శివ, కొమ్మిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


