ధాన్యం సేకరణకు ప్రణాళిక సిద్ధం

గతేడాది కన్నా 50 లక్షల మెట్రిక్ టన్నుల అధిక ధాన్యాన్ని సేకరించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది

తక్షణమే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధం.. అవసరమైతే 5.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం

ధాన్యం మద్దతు ధర రూ.69 లు అధికంగా ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు

రైతుల నుండి సేకరించిన ధాన్యం డబ్బులను 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది

కౌలు రైతులకు ఈ ఏడాది ప్రత్యేకంగా కార్డులు అందిస్తాం

డి. ముప్పవరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

నిడదవోలు: ధాన్యం సేకరణకు సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేశామని, గతేడాది కన్నా 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా సేకరించాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ మండలంలోని డి.ముప్పవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (PACS)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ధాన్యం జల్లెడ, ధాన్యం నాణ్యత, గోనె సంచులు, తేమ శాతం కొలిచే యంత్రాన్ని, డిజిటల్ వెయింగ్ స్కేల్ (తూనిక యంత్రాలు) ను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. సంబంధిత పరికరాలు పనిచేసే విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా రైతులకు తెలిసేలా ప్రతిరోజు నోటీసు బోర్డులో నమోదైన రైతుల సంఖ్య, మొత్తం రైతుల సంఖ్య, కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు, మొత్తం ధాన్యం కొనుగోళ్లు తదితర అంశాలను పొందుపరచాలని అధికారులకు సూచించారు. తక్షణమే 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో మాట్లాడి 5.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైతుల నుండి ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే వారి ఖాతాకు నగదు జమ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఆ కార్యక్రమాన్ని తూ.చా తప్పకుండా అమలు చేస్తామని భరోసానిచ్చారు. పండించిన పంటకు రూ.69 అధికంగా మద్దతు ధరను అందించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు, గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో ధాన్యం ఎక్కువగా పండించే నియోజకవర్గం నిడదవోలు అన్నారు. ఈ క్రమంలో తాను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో ప్రత్యేకంగా చర్చించి నిడదవోలు నియోజకవర్గంలో ధాన్యం సేకరణ లక్ష్యం పెంచాలని కోరగా వెంటనే ధాన్యం సేకరణ లక్ష్యాన్ని పెంచి రైతులకు సంతృప్తికర సహకారాన్ని అందించారని గుర్తుచేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరించాలని, ధాన్యం సేకరణ, మిల్లులకు తరలింపు, రైతులకు డబ్బుల చెల్లింపు విషయంలో అన్నదాతలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయమని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. గతంలో ధాన్యాన్ని సేకరిస్తే రెండు మూడు నెలలకు గానీ డబ్బులు జమ చేసేది కాదని స్వయంగా రైతులు చెప్పిన మాటలను ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సభాముఖంగా వెల్లడించారు. ఎన్నికల వస్తున్నాయన్న వేళ రైతులకు ధాన్యం డబ్బులు ఎగరగొడితే గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1674 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపుకు గురై పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించామన్నారు. కాయకష్టం చేస్తున్న కౌలు రైతులకు ఈ ఏడాది ప్రత్యేకంగా కార్డులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. రుతువుల వారీగా వర్షాలు వచ్చే పరిస్థితి లేదని, ప్రకృతి వైపరీత్యాలు ముంచేస్తున్నాయని ఈ క్రమంలో ధాన్యంలో తేమ శాతం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతన్నలకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని తెలుపుతూ ఇది రైతు పక్షపాతి ప్రభుత్వమని, రైతులు బాగుండాలని ఆలోచించే ప్రభుత్వమని మంత్రి దుర్గేష్ తెలిపారు. ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికి ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ను రూ.4000 కు పెంచామన్నారు. దివ్యాంగులకు రూ.6000, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.15,000 పెన్షన్ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పెన్షన్ ను రూ.2000 నుండి రూ.3000 పెంచేందుకు ఐదేళ్ల సమయం తీసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇచ్చిన సాహసోపేతమైన హామీని నెరవేర్చిందని గుర్తుచేశారు. కొత్తగా పెన్షన్లు ఇచ్చే అంశంపై చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే స్పౌజ్ పెన్షన్లు అందించిన విషయాన్ని తెలిపారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజనల క్రింద తొలి విడతగా రూ.7000 జమ చేశామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని, తల్లికి వందనం క్రింద కుటుంబంలో ఎంత మంది చదువుకుంటే అంతమందికి రూ.15,000 ఆర్థికసాయం అందించామన్నారు.

కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. యూరియా అధికంగా వినియోగించడం వల్ల భూమి సారవంతం కోల్పోతుందని, దిగుబడి తగ్గుతుందన్న విషయాన్ని రైతులు గ్రహించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా దిగుబడి పెరుగుతుందని, ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందని సూచించారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘస్వరూప్ , కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మితా, కొత్తపేట జనసేన ఇంచార్జ్ బండారు శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ పిక్కి నాగేంద్ర, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ చైర్మన్ భూపతి ఆదినారాయణ, సొసైటీ ఛైర్మన్, అధ్యక్షులు, సభ్యులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link