సమసమాజ నిర్మాణ స్ఫూర్తి ప్రదాత గుర్రం జాషువా

:- రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్

పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్

కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువ భావజాలాన్ని, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్న మంత్రి కందుల దుర్గేష్

2025కు గానూ డా. కనకదుర్గ ప్రసాద్ రావు, డా. పి.శ్రీధర్,మీసాల లక్ష్మణ్, పొట్లూరి హరికృష్ణ, కె.గురువమ్మలకు కవికోకిల గుర్రం జాషువా పేరిట ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నగదు పురస్కారాలను ప్రదానం చేసిన మంత్రి దుర్గేష్

భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు రచించిన విశ్వనరుడు పుస్తకాన్ని, కళా రత్న డా. పాలపర్తి శ్రీధర్ రచించిన ముక్తామణి పద్యశతకం పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

డిసెంబర్ 27 28 తేదీల్లో జరిగే ప్రపంచ తెలుగు కవుల మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్

కవులు, కళాకారులకు గుర్తింపు తెచ్చేందుకు మంత్రి దుర్గేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్న సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఛైర్ పర్సన్ తేజస్వి పొడపాటి

మంత్రి దుర్గేష్ కళాప్రేమికుడు అని కొనియాడిన నాటక రంగ అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ

విజయవాడ: కలాన్ని ఆయుధంగా వాడుకొని సమాజంలోని రుగ్మతలను రూపుమాపిన వ్యక్తి మహాకవి గుర్రం జాషువా అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఎన్టీఆర్ కలెక్టరేట్ కార్యాలయంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. నవయుగ కవి చక్రవర్తి జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సాహిత్యం కోసం కృషి చేస్తున్న డా. కనకదుర్గ ప్రసాద్ రావు, డా. పాలపర్తి శ్రీధర్,మీసాల లక్ష్మణ్, పొట్లూరి హరికృష్ణ, కె.గురువమ్మలకు కవికోకిల పద్మభూషణ్ గుర్రం జాషువా 2025 పేరిట ఒక్కొక్కరికి 50 వేల రూపాయల నగదు పురస్కారాలను మంత్రి దుర్గేష్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. పద్మశ్రీ, పద్మభూషణ్ ల కన్నా గుర్రం జాషువా అవార్డులు పొందడం గొప్ప విషయంగా భావించాలన్నారు. అంతకుముందు సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గుర్రం జాషువా చిత్రమాలికను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లిఖార్జున రావు రచించిన విశ్వనరుడు పుస్తకాన్ని,కళా రత్న డా. పాలపర్తి శ్రీధర్ రచించిన ముక్తామణి పద్యశతకం పుస్తకాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. అదేవిధంగా డిసెంబర్ 27, 28 తేదీల్లో జరిగే ప్రపంచ తెలుగు కవుల మహాసభల పోస్టర్ ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని తన పాండిత్యంతో పరవశింపజేసిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. అలాంటి విశ్వనరుడు పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. భావితరాలకు మహాకవి గుర్రం జాషువా గొప్పతనాన్ని తెలపాల్సిన అవసరాన్ని వివరించారు. ఒక ఒరవడిలో కొట్టుకుపోతున్న సాహిత్యాన్ని మలుపుతిప్పి పేదవాడి ఆకలి, అస్పృశ్యత, పేదరికం, కుల వివక్షతపై కలాన్ని చూపించాలన్న వ్యక్తి జాషువా అన్నారు. జాషువా చిన్నతనం, విద్యాభ్యాసంలో ఎదుర్కొన్న సమస్యలను వెల్లడించారు. సుకవి ప్రజల నాలుకలపై జీవిస్తారనడానికి జాషువానే నిదర్శనమన్నారు. జాతికి అందించిన అద్భుత పద్యాలు, నాటకరంగంలో చూపించిన చొరవ గొప్పది అన్నారు. తెలుగు నాటకం బతికి ఉన్నంత కాలం జాషువా పేరు నిలబడి ఉంటుందన్నారు. గుర్రం జాషువా ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాషువా రచించిన గబ్బిలం, ఫిరదౌసి, విశ్వనరుడు తదితర సామాజిక చైతన్యాన్ని రగిలించిన కవిత్వాలను వివరించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా రచించిన రుక్మిణి కళ్యాణం మొదలుకొని చిదానంద ప్రభాతం, కుశలవోపాఖ్యానం, కోకిల, సంసార సాగరం, గిజిగాడు, అఖండ గౌతమి, స్మశాన వాటిక, ఆంధ్రభోజుడు, కాంది శీకుడు, తెరచాటు, క్రీస్తు చరిత్ర తదితర రచనలను మంత్రి దుర్గేష్ ప్రస్తావించారు. గుర్రం జాషువా నడయాడిన శాసనమండలి నుండే తన రాజకీయ జీవితం ప్రారంభమైందని మంత్రి దుర్గేష్ గుర్తుచేసుకున్నారు. భావితరాలకు గుర్రం జాషువా భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. గుర్రం జాషువా హరిశ్చంద్ర నాటకంలో రాసిన అద్భుత పద్యాలు మనసును కదిలిస్తాయన్నారు.ఆయన హృద్యమైన కవితాధోరణికి సలామ్ అన్నారు. మహానుభావుడు గుర్రం జాషువాను స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సాంస్కృతిక, సృజనాత్మక సమితి ఛైర్ పర్సన్ తేజస్వి పొడపాటి మాట్లాడుతూ గొప్ప కవి గురించి ఈ తరానికి తెలియకపోవడం బాధాకరం అన్నారు. కవిత్వం అంటే సమాజాన్ని మార్చే ఆయుధం అని నమ్మిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. సామాజిక రుగ్మతలను కలంతో రూపుమాపిన వ్యక్తి గుర్రం జాషువా అని కొనియాడారు.గబ్బిలం అనే కవిత్వం ద్వారా కుల,మత విద్వేషాలను పారద్రోలిన మహోన్నత వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. విశ్వనరుడు అనే పుస్తకాన్ని ఆదర్శంగా తీసుకొని సాగుతున్న వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని ఈ సందర్భంగా గుర్తుచేశారు. పేదరికం,మతబేధాలు తనను గొప్పకవిగా తీర్చిదిద్దాయన్న గుర్రంజాషువా మాటలను తేజస్వి ప్రస్తావించారు. రాష్ట్రంలో పుట్టిన ఎంతో మంది మహనీయుల గురించి ఈ తరానికి తెలపాల్సిన అవసరాన్ని వెల్లడించారు. మంత్రి కందుల దుర్గేష్ కవులు, కళాకారులకు గుర్తింపు తెచ్చేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారని కొనియాడారు.

నాటక రంగ అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ మాట్లాడుతూ సామాన్య మనుషులకు సైతం అర్థమయ్యే రీతిలో రచనలు చేసిన వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. మంత్రి దుర్గేష్ కళాప్రేమికుడు అని కొనియాడారు.

కార్యక్రమంలో భాగంగా ఓ కళాప్రపూర్ణుడా జాషువా కవీంద్రుడా అందుకో వందనం అంటూ మహాకవి గుర్రం జాషువాపై ఆలపించిన గీతాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.అదే విధంగా పురస్కార గ్రహీతలు కవికోకిల గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన ప్రస్థానాన్ని, కవిత్వాన్ని, సాహిత్య పాండిత్యాన్ని తమదైన శైలిలో వివరించారు.సామాజిక స్థితిగతులను కవిత్వంగా మార్చిన వ్యక్తి కవి గుర్రం జాషువా అని పేర్కొన్నారు. అక్షరాలనే అస్త్రాలుగా మార్చి అక్షరాలతో యుద్ధం చేయవచ్చని నిరూపించిన కవి గుర్రం జాషువా అన్నారు. పశువుల కాపరి నుండి ప్రపంచాధినేత వరకు పాడుకునే శైలిలో కవిత్వం రాసిన మహోన్నత మనిషి గుర్రం జాషువా అన్నారు. చీత్కారాల నుండి సత్కారాలు పొందే స్థాయికి ఎదిగిన వ్యక్తి గుర్రం జాషువా అన్నారు. కోట్లు సంపాదించిన కవులు లేరు కానీ కోట్లాది హృదయాలు గెలిచిన కవులు కోకొల్లలు ఉన్నారన్నారు. ప్రతి సందర్భంలో కళాత్మకంగా మాట్లాడే సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వాగ్దాటిని పలువురు కొనియాడారు.గుర్రం జాషువా విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన రమణను మంత్రి దుర్గేష్ అభినందించారు.

కార్యక్రమంలో సాంస్కృతిక, సృజనాత్మక సమితి ఛైర్ పర్సన్ తేజస్వి పొడపాటి, డైరెక్టర్ రేగుళ్ల మల్లిఖార్జున రావు, ఎన్టీఆర్ కలెక్టర్ జి. లక్ష్మీశ, నాటక రంగ అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సాంస్కృతిక శాఖ అధికారులు సుమన్, శ్రీనివాస్, ప్రముఖ రంగ స్థల, సినీ నటుడు మీసాల లక్ష్మణ్, నంది అవార్డు గ్రహీత డా. కనకదుర్గా ప్రసాద్ రావు, పదేళ్లుగా జాషువా కవిత్వాన్ని ప్రజల్లో ఉంచిన కత్తి గురువమ్మ,
45 ఏళ్లుగా తెలుగు సాహిత్యానికి కృషి చేస్తున్న డా. శ్రీధర్, జానపద కళల అకాడమీ మాజీ ఛైర్మన్, సహస్ర కవితా సంకలనం చేసిన పొట్లూరి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link