పన్నుల వ్యవస్థలో పారదర్శకత
నెల రోజుల పాటు జీఎస్టీపై అవగాహన
వెల్లడించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
దేశప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 చారిత్రాత్మకమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. నరేంద్రమోదీ 2014లో తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఉపయోగపడ్డాయని అన్నారు. ఆదివారం తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. పన్నుల వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చి వ్యాపార అభివృద్ధితోపాటు పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 2017లో జీఎస్టీ విధానం తీసుకురావడం వల్ల దేశంలో వ్యాపారవర్గాలు, పరిశ్రమలకు అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. దీంతో సరళతరమైన పన్నుల విధానం అమలు చేయడంతో దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని చెప్పారు. జీఎస్టీ అమలుతో చారిత్రాత్మక నిర్ణయంతో భవిష్యత్తులో దేశ ఆర్థిక ప్రగతికి దిశ నిర్దేశం చేసే విధంగా ప్రణాళికలు చేశారన్నారు. జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో జీఎస్టీ 2.0 అమలును స్వాగతించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఈ విధానం కారణంగా రాష్ట్రంలోని ప్రజలకు ప్రత్యక్షంగా భారం తగ్గుతుందని, వ్యాపారులకు లాభాలు చేకూరతాయన్నారు. పేద, మధ్య తరగతి వర్గాలు వినియోగించే నిత్యావసరాల ధరలు తగ్గుతాయని అంతే కాకుండా వ్యవసాయ అధారిత పరికరాలపై జీఎస్టీ తొలగించడం పెద్ద ఊరట అన్నారు. జీఎస్టీ 2.0 విధానంపై రాష్ట్రంలో నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో సైతం కూటమి నాయకులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులకు ఎమ్మెల్యే రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.


