ఆక్వాకల్చర్, అగ్రికల్చర్ హబ్ గా తూర్పుగోదావరి జిల్లా

రాజమహేంద్రవరం మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి శరవేగంగా జరుగుతోందని స్పష్టం

2047 నాటికి ఏపీని ప్రపంచ ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని వెల్లడి

సీఎం చంద్రబాబునాయుడు పర్యాటక రంగానికి పారిశ్రామిహోదా కల్పనతో ఊతం వచ్చిందన్న మంత్రి దుర్గేష్

ప్రసిద్ధ క్షేత్రాల్లో స్టార్ హోటల్లు, రిసార్ట్ ల నిర్మాణం,హోం స్టేలు, టెంట్ సిటీల ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన మంత్రి

అఖండ గోదావరితో రాజమండ్రి, కడియం, నిడదవోలుకు సరికొత్త పర్యాటక శోభ

15 నెలల కాలంలో నిడదవోలు అభివృద్ధికి దాదాపు రూ.300 కోట్లు వెచ్చించామని స్పష్టం..ఎర్రకాలువ ముంపు సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపిస్తామని హామీ

కార్యనిర్వాహక ప్రక్రియలో భాగంగానే బదిలీలు.తూర్పుగోదావరి జిల్లా పాత కలెక్టర్ పి. ప్రశాంతి పనితీరుపై ప్రశంస.. నూతన కలెక్టర్ కీర్తి చేకూరికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్

గత ప్రభుత్వాధినేత జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు ఎక్కడ అని నిలదీసిన మంత్రి దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్

పీపీపీ అంటే అర్థం తెలియని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దరిద్రమని విమర్శ

మంత్రిగా జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు చేసిన రోజాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత ఎక్కడుందని మండిపాటు

90 శాతం ప్రజా సమస్యలపై, 10 శాతం సినిమా కోసం సమయం వెచ్చిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై దొంగవ్యాపారాలు, కబ్జాలు చేసే రోజాకు మాట్లాడే అర్హత ఉందా? అని నిలదీత

డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలోని ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్న తొలి ఎమ్మెల్యే, మంత్రిని తానేనని గర్వంగా తెలిపిన మంత్రి కందుల దుర్గేష్

ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండలకు యునెస్కో జాబితాలో చోటు దక్కించుకోవడం అభినందనీయమన్న మంత్రి దుర్గేష్

అక్టోబర్ నుండి జనసేనాని నేతృత్వంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి..అదే సమయంలో పార్టీ పదవుల నియామకం చేపడతామని వెల్లడి

జనసేనాని ఆశీస్సులతో కూటమి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం లభించిందని పేర్కొన్న మంత్రి దుర్గేష్

పరిపాలన దక్షుడైన సీఎం చంద్రబాబునాయుడు కేబినెట్ లో మంత్రిగా పనిచేస్తుండటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి శరవేగంగా జరుగుతోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరం క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ 15 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర పర్యాటకాభివృద్ధికి తీసుకున్న చర్యలు, పనుల పురోగతిని వివరించారు. అదే విధంగా తాజా రాజకీయ పరిణామాలు, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, మెడికల్ కాలేజీల అంశం, నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి, జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అన్ని అంశాలను మీడియా ప్రతినిధులతో మంత్రి కందుల దుర్గేష్ పంచుకున్నారు. దాదాపు గంట సేపు మీడియా ప్రతినిధులతో మంత్రి దుర్గేష్ సంభాషించారు. మీడియా ప్రతినిధులు అడిగిన అన్ని ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలిచ్చారు.

15 నెలల కాలంలో రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు సాధించాం:మంత్రి కందుల దుర్గేష్

కూటమి ప్రభుత్వ 15 నెలల కాలంలో రూ.10,644 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడిదారుల సదస్సులు ఏర్పాటు చేసి పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలు వివరించామన్నారు. ఇప్పటికే రూ.698 కోట్లతో 88 ప్రాజెక్టులు ప్రారంభించినట్లు మంత్రి దుర్గేష్ వెల్లడించారు. తద్వారా పర్యాటక, అతిథ్య రంగంలో 3554 మందికి ఉపాధి కలగనుందన్నారు.పర్యాటక రంగం ద్వారా ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పనకు, సాంస్కృతిక మార్పిడికి బాటలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అదే విధంగా ఐదేళ్లలో రూ.25,000 కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని ధ్యేయంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలోని హోటళ్లలో గదుల సంఖ్యను 50 వేలకు పెంచేలా నిర్ణయించామన్నారు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడ్డాయన్నారు. 4.6 శాతం ఉన్న జీవీఏను 8 శాతానికి పెంచడం, 28 శాతానికి పైబడి జీవీఏను కంట్రిబ్యూట్ చేయడం, పర్యాటక రంగంలో 12 శాతం ఉపాధిని 15 శాతానికి పెంచాలన్న ధ్యేయంతో పర్యాటక శాఖ పనిచేస్తుందన్నారు. ఒక రోజు విజిట్ కు వచ్చిన పర్యాటకుడు కనీసం రెండు, మూడు రోజులు ఆయా పర్యాటక ప్రాంతాల్లో ఉండేలా మౌలిక వసతులు కల్పించడంతో పాటు పర్యాటక రంగంలో ఒక పర్యాటకుడు పెట్టే ఖర్చును 1,700 నుండి 25,000 ఖర్చు చేసే విధంగా ప్రణాళికలు రచించామన్నారు. ఈ క్రమంలో టెంపుల్ టూరిజంతో పాటు ఎకో, వెల్ నెస్, అడ్వెంచర్, క్రూజ్, రివర్, హెరిటేజ్, రిలీజియస్ తదితర టూరిజం ప్రక్రియలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2047 నాటికి ప్రపంచంలో ఏపీని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. భారతదేశానికి విదేశీ పర్యాటకులు అత్యధికంగా వచ్చే టాప్‌ 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ఒకటిగా తయారుచేయాలన్న తమ ఆలోచన అని మంత్రి దుర్గేష్ వివరించారు.

పర్యాటక రంగానికి పారిశ్రామిహోదాతో ఊతం:మంత్రి కందుల దుర్గేష్

సీఎం చంద్రబాబునాయుడు పర్యాటకరంగానికి పారిశ్రామిక హోదా కల్పించడంతో ఊతం లభించిందని మంత్రి దుర్గేష్ అన్నారు.తద్వారా ఏదైనా ప్రాజెక్టు పెట్టినప్పుడు భూకేటాయింపులు, ఎస్జీఎస్టీ రీయింబర్స్ మెంట్ తో పాటు కేపిటల్ సబ్సిడీ, క్వాలిటీ సర్టిఫికేట్, ఉద్యోగాల కల్పనపై రాయితీలు, తాగునీటి ఛార్జీలు, మురుగునీటి శుద్ధి, ఆస్తి పన్నుపై పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ అందిస్తున్నామన్నారు. అదే విధంగా సీఎం చంద్రబాబునాయుడు చొరవతో నూతన పర్యాటక పాలసీ -2024-29 విడుదల, భూకేటాయింపుల విధానం, ఉపాధి కల్పనపై ప్రోత్సాహకాల విధానం, సాహస పర్యాటక కార్యక్రమాలు వంటి కొత్త పాలసీలు విడుదల చేశామన్నారు. తద్వారా స్థిరమైన, బాధ్యతాయుత, సమగ్ర, పర్యావరణహిత పర్యాటక విధానాలకు శ్రీకారం చుట్టామని, పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని, వేలాది కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామన్నారు.

ప్రసిద్ధ క్షేత్రాల్లో స్టార్ హోటల్లు, రిసార్ట్ ల నిర్మాణం..హోం స్టేలు, టెంట్ సిటీల ఏర్పాటు:మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సహజత్వం కోల్పోకుండా పాత కాలం నాటి మండువా లోగిళ్లు, పురాతన కట్టడాల్లో హోమ్ స్టేలు ఏర్పాటు చేసి అత్యాధునిక సౌకర్యాలు కల్పనకు శ్రీకారం చుట్టామని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. అదే విధంగా రిసార్ట్ లతో పాటు స్టార్ హోటళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఏపీ పర్యాటక ప్రాంతాల్లో ఎక్కువ రోజులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ నేపథ్యంలో విదేశీయులకు భారతదేశంలోని గ్రామీణ వాతావరణం పరిచయం చేస్తున్నామన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని 25 ప్రసిద్ధ ప్రాంతాల్లో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. లంబసింగి, శ్రీశైలం, ఒంటిమిట్ట తదితర ప్రాంతాలు అద్భుత పర్యాటక ప్రదేశాలని కానీ సరైన వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఏర్పాట్లు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. క్యారవాన్ టూరిజం అనే అంశం నూతన పాలసీలోనిదే అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు ఆలోచనలతో దాన్ని పాలసీలో చేర్చామన్నారు. అబ్రాడ్ లలో క్యారవాన్ టూరిజం అభివృద్ధి జరిగిందన్నారు. టూరిజం సర్క్యూట్ లలో ఈ క్యారవాన్ వెహికిల్స్ ఉపకరిస్తాయన్నారు. ఇటీవలే విశాఖలో సైట్ సీయింగ్ కోసం డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించామన్నారు. రూ.250 టికెట్ కొంటే 24 గంటలు తిరిగేలా 11 సందర్శనీయ ప్రాంతాలను చూసేందుకు వీలు కల్పించామన్నారు.

రాష్ట్ర పర్యాటక రంగానికి కేంద్ర సహకారం మెండుగా ఉంది:మంత్రి కందుల దుర్గేష్

రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధి కేంద్రం ఇతోధికంగా సాయం అందిస్తోందని మంత్రి దుర్గేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన శాస్కి, స్వదేశీ దర్శన్ 2.0, సీబీడీడీ, ప్రసాద్ స్కీమ్ ల ద్వారా రాష్ట్రంలో అఖండగోదావరి, గండికోట, సూర్యలంక బీచ్ అభివృద్ధి తదితర పర్యాటక ప్రాజెక్టులతో పాటు అన్నవరం, అహోబిలం,సింహాచలం వంటి దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయని, పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.శాస్కి ద్వారా అఖండ గోదావరికి రూ.94.44 కోట్లు, గండికోట పర్యాటక ప్రాజెక్టుకు రూ.77.91 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని దీన్ని గ్రాండ్ కేనియన్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిందన్నారు. స్వదేశీ దర్శన్ 2.0 ద్వారా సూర్యలంక బీచ్ అభివృద్ధికి రూ.97.52 కోట్లు మంజూరు అయ్యాయని, త్వరలోనే అధునాతన సౌకర్యాలతో మరింత అందంగా దర్శనమివ్వనుందన్నారు. అదే విధంగా బొర్రా గుహలు, లంబసింగికి నిధులు మంజూరు అయ్యాయని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు.ప్రసాద్ స్కీమ్ ద్వారా అన్నవరం, అహోబిలం, సింహాచలం దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు.

రాజమండ్రి, కడియం, నిడదవోలుకు సరికొత్త పర్యాటక శోభ తెస్తాం:మంత్రి కందుల దుర్గేష్

శాస్కి స్కీమ్ ద్వారా అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ..94.44 కోట్లు మంజూరు చేసిందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. తద్వారా రాజమహేంద్రవరంలో 127 ఏళ్ల చరిత్ర కలిగిన హేవలాక్ వంతెన పునర్నిర్మాణం, పుష్కర ఘాట్ ను అధ్యాత్మిక గమ్యస్థానంగా అభివృద్ధి చేసి డైనమిక్ టూరిస్ట్ డెస్టినేషన్ గా తీర్చిదిద్దనున్నామన్నారు. బ్రిడ్జిలంకలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమం చేశామని, కొన్ని కాంపోనెంట్స్ కి టెండర్లు పూర్తయ్యాయని, మరి కొన్నింటికి తుది దశలో ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రాజమండ్రితో పాటు కడియం, నిడదవోలును కలుపుతూ సరికొత్త పర్యాటక శోభ తెస్తామన్నారు. అభివృద్ధితో ఆయా ప్రదేశాల్లో జరుగుతున్న అసాంఘీక కార్యకలాపాలకు చెక్ పడుతుందన్నారు.

సర్వతోముఖంగా నిడదవోలు అభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్

15 నెలల కాలంలో నిడదవోలు అభివృద్ధికి దాదాపు రూ.300 కోట్లు వెచ్చించామని మంత్రి దుర్గేష్ వివరించారు. నియోజకవర్గంలోని 30 పడకల ఆస్పత్రిని 100 పడకలుగా మార్చడం, జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి నుండి నిడదవోలుకు త్రాగునీరు అందించడంతో పాటు ఇండోర్ స్టేడియం తీసుకొస్తామన్నారు. ఆ దిశగా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామన్నారు.

తూర్పుగోదావరి జిల్లాను ఆక్వా కల్చర్, అగ్రి కల్చర్ హబ్ గా చేస్తాం:మంత్రి కందుల దుర్గేష్

ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు రాజమండ్రి ప్రధాన కేంద్రంగా ఉందని, జిల్లా అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. తూర్పుగోదావరి వ్యవసాయాధారిత, ఆక్వా ఆధారిత జిల్లా కాబట్టి దీన్ని ఆక్వా కల్చర్, అగ్రి కల్చర్ హబ్ గా చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబునాయుడు ఆ దిశగా రూపకల్పన చేశారన్నారు.ధాన్యం అధికంగా పండించే ప్రాంతం తూర్పుగోదావరి అని, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ తో మాట్లాడి ధాన్యసేకరణకు చర్యలు తీసుకున్నామన్నారు. 24 గంటల్లోనే రైతు నుండి సేకరించిన ధాన్యానికి నగదు జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రైతు నుండి ధాన్యం సేకరించి రెండు మూడు నెలలైనా నగదు జమ చేసిన దాఖలాలు లేవన్నారు. రైతులకు అందుబాటులో ఉండేలా రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో యూరియా కొరత లేదు:మంత్రి కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లాలో యూరియా కొరత లేదని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. యూరియా విషయంలో ఎక్కడైనా కొరత ఉందని తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలోనే కేంద్రం నుండి మరిన్ని టన్నుల యూరియా రానుందని తద్వారా ఎక్కడా కూడా రైతులకు యూరియా కొరత అనే సమస్యనే లేకుండా చేస్తామన్నారు.

ఎర్రకాలువ ముంపుకు దీర్ఘకాలిక పరిష్కారం:మంత్రి కందుల దుర్గేష్

ఎర్రకాలువ ద్వారా 6500 క్యూసెక్కుల నీరు వచ్చిందని తమకు సమాచారం అందినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. అది 8500 క్యూసెక్కులు దాటితే ప్రమాదం పొంచి ఉంటుదని, ఇప్పటికే తాము కలెక్టరేట్ ఆఫీస్ లో, ఆర్డీవో కార్యాలయాల్లో, నిడదవోలులో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, పంట నష్టం జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టామని రైతులకు భరోసానిచ్చారు. ఈ విషయమై తాను కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడానని, నిరంతం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ టీం ను సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎర్రకాలువ ముంపు వల్ల గోపాలపురం, నిడదవోలు నియోజకవర్గాలు ప్రభావానికి లోనవుతున్నాయన్నారు. గతేడాది ఎర్రకాలువ ముంపు వల్ల పంట నష్టం సంభవించిందని, ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ సీఎం చొరవతో ఆయా రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ అందించామన్నారు. త్వరలోనే ఎర్రకాలువ ముంపుకు దీర్ఘకాలిక పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు.

పాత కలెక్టర్ ప్రశాంతి పనితీరుపై ప్రశంస.. నూతన కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి దుర్గేష్

15, 16 తేదీల్లో అమరావతిలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన పి. ప్రశాంతి పనితీరు అద్భుతమని ప్రశంసించారు. నూతన కలెక్టర్ కీర్తి చేకూరిని స్వాగతిస్తున్నామని, జిల్లా అభివృద్ధికి మంచి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

అభివృద్ధిలో భాగంగా, కార్యనిర్వాహణలో భాగంగా కలెక్టర్లు, ఎస్పీల మార్పులు సహజం అని బదిలీలపై స్పష్టతనిచ్చారు. ఎవరు మారినప్పటికీ రైతులకు భరోసా, మహిళల రక్షణ, యువతకు ఉద్యోగాల కల్పన తదితర ప్రభుత్వ విధానాలు నిరంతరం కొనసాగుతాయన్నారు.

బదిలీల వల్ల పుష్కరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, గోదావరి పుష్కరాలు 2027 లో జరుగనున్నాయని స్పష్టం చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పుష్కరాల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు గుర్తుచేశారు. పకడ్బందీగా పుష్కరాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా విజయరామరాజు, వీరపాండ్యన్ వంటి అధికారులను నియమించిందని, పుష్కరాలు సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి దుర్గేష్ చెప్పారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత అభివృద్ధికి త్వరలో కొత్త టీమ్ తో అక్టోబర్, నవంబర్ లో రివ్యూ మీటింగ్ నిర్వహించి పుష్కరాల కోసం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు.

పుణ్యక్షేత్రాల్లో రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు. గడిచిన ఐదేళ్లలో సరైన నిర్వహణ లేక వసతుల లేమి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ క్రమంలో పీపీపీ విధానంలో తాము ఒబెరాయ్, మేఫేర్, తాజ్, అట్మోస్పియర్ తదితర ప్రఖ్యాత సంస్థలో చేసుకున్న ఎంవోయూలతో స్టార్ హోటల్లు, రిసార్ట్స్ ల నిర్మాణం జరుగుతుందన్నారు. అదే విధంగా హోం స్టేలు, టెంట్ సిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తద్వారా వసతికి ఇబ్బంది ఉండదన్నారు. పుష్కరాల్లో జోనింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు.

పీపీపీ అంటే అర్థం తెలియని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దరిద్రం:మంత్రి కందుల దుర్గేష్

పీపీపీ అంటే అర్థం తెలియని ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం దరిద్రమని మంత్రి దుర్గేష్ విమర్శించారు. పీపీపీ అంటే కేవలం ప్రైవేటీకరణ అని ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులు పీపీపీ క్రింద వస్తాయని, పీపీపీలో చేపట్టే ప్రాజెక్టులపై అజమాయిషీ, నియంత్రణ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ప్రాజెక్టు త్వరితగతిన జరిగేందుకు అవకాశముంటుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి, మాజీ పర్యాటక మంత్రికి పీపీపీకి అర్థం తెలియకపోవడం శోచనీయమన్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నారని దుష్ప్రచారానికి తెగబడ్డారన్నారు. ఏ రోజూ కూడా వీళ్లు పీపీపీ విధానంలో అభివృద్ధి చేద్దామన్న ఆలోచన చేయలేదన్నారు. పీపీపీ అర్థం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని వైసీపీ నాయకులకు సూచించారు. నిజంగా గత ప్రభుత్వ హయాంలో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి అయితే రాజమండ్రి కాలేజీ పరిస్థితి ఏంటో మీడియా ప్రతినిధులే చెప్పాలన్నారు. రాజమండ్రి మెడికల్ కాలేజీ నేటికీ పూర్తికాలేదన్నారు. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోందన్నారు. ఐదేళ్లలో దశల వారీగా ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారో లెక్క చెప్పాలన్నారు. సకాలంలో నిర్మాణాలు జరిగి అత్యాధునిక సౌకర్యాల కోసమే పీపీపీ అన్నారు.

పర్యాటక రంగానికి ఏటా రూ.7 కోట్ల అత్యధిక ఆదాయాన్నిచ్చే హరిత రిసార్ట్స్ స్థానంలో రుషికొండ ప్యాలెస్ లాంటి రాజప్రాసాదం నిర్మాణం చేపట్టి పర్యాటక ఆదాయానికి గత ప్రభుత్వం గండి కొట్టిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆదాయాన్ని కోల్పోయిన పర్యాటక శాఖ ఏటా కోటి రూపాయలు కరెంట్ బిల్లులు కట్టే పరిస్థితి వచ్చిందన్నారు.

90శాతం ప్రజా సమస్యలు, 10 శాతం సినిమా కోసం సమయం వెచ్చిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రోజాకు మాట్లాడే అర్హత ఉందా? :మంత్రి కందుల దుర్గేష్

నాడు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజా జబర్దస్త్ ప్రోగ్రాంలో నిర్ణేతగా వ్యవహరించలేదా అని మంత్రి దుర్గేష్ నిలదీశారు. ఆ కార్యక్రమంలో రకరకాల విన్యాసాలు చేసిన రోజాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాట్లాడే అర్హత ఎక్కడుంది అని మండిపడ్డారు. పర్యాటక మంత్రిగా రోజా రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. నాటి రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకాభివృద్ధికి తీసుకున్న చర్యలేంటి? కేంద్రంతో మాట్లాడి ఏ రోజైనా నిధులు తీసుకొచ్చారా అని ప్రశ్నలు సంధించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో గ్రామసభలు నిర్వహించారన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా వేలాది కోట్ల నిధులు తెచ్చారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలోని ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.20 కోట్ల నిధులు మంజూరు చేయించుకున్న తొలి ఎమ్మెల్యే, మంత్రిని తానేనని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ ద్వారా లింక్ రోడ్లు, గ్రామీణ రోడ్లు వేయించామన్నారు. పంచాయతీలకు ఆదాయాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏనాడు కూడా ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అలసత్వం వహించలేదని, ఖాళీ సమయాన్ని మాత్రమే సినిమాల కోసం వెచ్చిస్తున్నారన్నారు. ఆయనకు సినిమా,రాజకీయం తప్ప మరో వ్యాపకం లేదన్నారు. కానీ రోజాకు వ్యాపారాలున్నాయి..దొంగ వ్యాపారాలున్నాయి. కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు ఏరకమైన వ్యాపారాలు లేవన్నారు. సినిమా ద్వారా వచ్చిన ఆదాయాన్ని సైతం ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నారని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఆయన విమాన ప్రయాణాలపై ఆక్షేపించడానికి ఏ మాత్రం అభివృద్ధి చేయని రోజాకు ఏ అర్హత లేదన్నారు.

73,74 రాజ్యాంగ సవరణల ద్వారా సంక్రమించిన 11వ షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహిస్తామని మంత్రి దుర్గేష్ న్నారు. గత ఐదేళ్లలో గ్రామసభలను పట్టించుకోని గత ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. గత ప్రభుత్వం గ్రామసభలను నిర్వహించకుండా పక్కనబెడితే వాటిని ప్రారంభించిన ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. రాష్ట్రంలో తాము ఏ కొత్త ప్రాజెక్టు, ఏ కొత్త కార్యక్రమం చేపట్టినా తాము ప్రజాభిప్రాయం మేరకే ముందుకు వెళ్తున్నామన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ గ్రామాలను పట్టించుకోలేదన్నారు.

ఎర్రమట్టి దిబ్బలు, తిరుమల కొండలకు యునెస్కో జాబితాలో చోటు దక్కించుకోవడం అభినందనీయమన్నారు. దీని వెనుక పర్యాటక శాఖ అధికారుల కృషి ప్రశంసనీయమన్నారు.సహజ వారసత్వ సంపదగా గుర్తించేందుకు మొదటి అడుగు పడిందన్నారు. అహోబిలానికి ఈ గుర్తింపు దక్కేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అక్టోబర్ నుండి జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం చర్యలు చేపడతామన్నారు. రాష్ట్రంలో అన్ని చోట్లా పార్టీ పై స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు నిర్మాణం జరిగి పటిష్టతకు బీజం పడుతుందన్నారు. అదే విధంగా పార్టీ నియామకాలు చేపడతామన్నారు.

జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో మంత్రిగా అవకాశం లభించిందని, పరిపాలన దక్షుడైన విజనరీ లీడర్ సీఎం చంద్రబాబునాయుడు మార్గదర్శకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి కందుల దుర్గేష్ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో అన్నారు.

Scroll to Top
Share via
Copy link