సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావు…

తణుకు,ఆగష్టు 22
సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావు రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తణుకులో జరిగిన రెండు రోజుల సీపీఐ జిల్లా మహాసభల్లో పార్టీ జిల్లా కార్యదర్శిగా తనతో పాటు తొమ్మిది మందితో జిల్లా కార్యవర్గం,31 మందితో జిల్లా సమితి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు భీమారావు చెప్పారు.కార్యవర్గ సభ్యులుగా కలిశెట్టి వెంకట్రావు,బొద్దాని నాగరాజు,సికిలే పుష్పకుమారి,ఎం.సీతారాం ప్రసాద్,సీహెచ్ రంగారావు,నెక్కంటి క్రాంతికుమార్,సనపల శ్రీనివాస్,మండల నాగేశ్వరావు ఎన్నికయ్యారన్నారు.
భీమారావు మాట్లాడుతూ సుదీర్ఘ కాలంగా ఎన్నికలు లేకుండా ప్రత్యేకాధికారుల పాలనలో మగ్గుతున్న తణుకు, తాడేపల్లిగూడెం,పాలకొల్లు, భీమవరం మునిసిపాలిటీలలో వున్న అవాంతరాలను తొలగించి త్వరితగతిన ఎన్నికలు నిర్వహించాలని మహాసభ తీర్మానించిందన్నారు.జిల్లాలో రైతులు, కౌలు రైతులు,ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి, రైతాంగం పండించే పంటలకు కనీస మద్ధతు ధర లభించేందుకు ఉద్యమించాలని మహాసభల్లో తీర్మానించినట్టు భీమారావు చెప్పారు.పంట కాలువలకు ఆధునీకరణ పనులు నిర్వహించి కాలువల్లో,డ్రైన్ లలో పేరుకు పోతున్న చెత్త, పూడిక ఎప్పటికప్పుడు తొలగించాలని రైతాంగం పండించే పంటలకు సాగునీరు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మహాసభలో తీర్మానించినట్టు చెప్పారు.గోదావరి జలాలు కలుషితం కాకుండా చూడాలని,కాలుష్య నివారణ చర్యలు చేపట్టి పరిశభ్రమైన తాగునీరు, సాగునీరు అందించాలని తీర్మానించినట్టు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని కోరుతూ తీర్మానం ఆమోదించినట్టు భీమారావు చెప్పారు. జిల్లాలో ప్రజలెదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారానికి జిల్లా సమగ్రాభివృద్ధికి మహాసభల్లో పలు తీర్మానాలు ఆమోదించామని వాటి సాధనకు పోరాట కార్యచరణ రూపొందించి నట్టు భీమారావు చెప్పారు.

Scroll to Top
Share via
Copy link