ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్య సేవలు

నెహ్రూనగర్ లో రూ.1.36 కోట్లతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్

గోడలు కట్టి పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా అని వైకాపా ప్రభుత్వాన్ని నిలదీసిన మంత్రి దుర్గేష్

అన్ని రకాల అనుమతులతో త్వరలోనే నిడదవోలులో 100 పడకల ఆస్పత్రి, క్రీడామైదానం, చిన్న కాశిరేవు బ్రిడ్జి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసిన మంత్రి దుర్గేష్

నిడదవోలు: ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని నెహ్రూనగర్-1 లో రూ. 1.36 కోట్ల వ్యయంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుతో నిర్మించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. అనంతరం ఫార్మసీ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిని అంతా తిరిగి చూశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, రూ.1 కోటి 1 లక్ష నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ నిధులు, రూ.35 లక్షల మున్సిపల్ సాధారణ నిధులతో మొత్తంగా కేంద్ర, రాష్ట్ర నిధులతో పాటు మున్సిపల్ సాధారణ నిధులు వెచ్చించి ఆసుపత్రిల నిర్మాణాలు చేపట్టి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు రేపటి నుండి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రహారీగోడ విషయంలో సమయోచితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే రూ.13 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వైద్యావసరం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో పట్టణ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించుకోవడం తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందిస్తుండటం సంతోషకరంగా ఉందన్నారు. కొన్ని రకాల ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స అందిచడం ద్వారా నయం చేయవచ్చన్నారు. అదే చేయిదాటిన తర్వాత వ్యాధులు గుర్తించినా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వైద్య నిపుణులు, అర్హులైన ల్యాబ్ టెక్నీషియన్, నాణ్యమైన మందులు ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు.గత ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్ ను పూర్తి చేయలేకపోవడం వల్ల చాలా మంది పేద ప్రజలు వైద్యం అందుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అంశాలను నిరంతర ప్రక్రియగా గత ప్రభుత్వం ఎందుకు భావించలేదని ప్రశ్నించారు. ఈ నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించుకోవాల్సిన కర్తవ్యాన్ని ఎందుకు నిర్వర్తించలేకపోయారని గత వైకాపా ప్రభుత్వాన్ని నిలదీశారు. పూర్తికాని బిల్డింగ్ లకు పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చినప్పుడే కర్తవ్యం నెరవేరినట్లని తెలిపారు. గోడలు కట్టి పేర్లు పెట్టుకుంటే సరిపోతుందా అని ఫైర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేసి నిర్మాణాలు పూర్తి చేసి మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు. ప్రత్యేక శ్రద్ధ వహించి సంపూర్ణ ఆస్పత్రిగా దీన్ని తీర్చిదిద్దామన్నారు. గత ప్రభుత్వం బిల్డింగులు కట్టామని ఎంత గొప్పగా చెప్పుకున్నా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది మాత్రం కూటమి ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ఇలాంటి సెంటర్లు ప్రతి చోటా ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. వైద్యం కొరకు వచ్చే పేద ప్రజలకు వైద్య పరీక్షలు మందులు అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు.

అన్ని రకాల అనుమతులతో త్వరలోనే నిడదవోలులో క్రీడా మైదానం, 100 పడకల ఆస్పత్రి, చిన్నకాశిరేవు బ్రిడ్జి:మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలులో క్రీడా మైదానం, 100 పడకల ఆస్పత్రి, చిన్నకాశిరేవు బ్రిడ్జులను పూర్తి స్థాయి అనుమతులతో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి దుర్గేష్. కేంద్ర ప్రభుత్వం తొలి నుంచి రాష్ట్రానికి సాయం అందిస్తుందని తెలిపారు.
ఇప్పటికే నిడదవోలులోని 30 పడకల ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా రూపాంతరం చెందేందుకు తాము పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామన్నారు.గత ప్రభుత్వం ఆస్పత్రి మంజూరు చేయించామని చెప్పి కొబ్బరికాయ కొట్టి చేతులు దులుపుకుందన్నారు. అవసరమైన వైద్యులు, వైద్య సిబ్బంది, వారి వేతనాలు, పరికరాలు, మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆర్థిక అనుమతుల అంశాన్ని పట్టించుకోకపోవడం వల్ల తూతూ మంత్రంగా వదిలేయడం వల్ల ఆ అంశం నీరుగారితే తాము మళ్లీ పట్టాలెక్కించామని గుర్తుచేశారు. ఈ క్రమంలో తాను సీఎం చంద్రబాబునాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీలను కలిసి క్యాన్సల్ అయ్యే ప్రతిపాదనకు పునరుజ్జీవం పోసినట్లు తెలిపారు. గతంలో కాంట్రాక్టర్లకు, నాటి నాయకులకు లబ్ధి కలిగేలా వ్యవహరించారే తప్ప ప్రజల ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేద్దామన్న ఆలోచన గత ప్రభుత్వం చేయలేదని ఆగ్రహించారు.

చిన్నకాశిరేవు బ్రిడ్జి విషయంలో గత ప్రభుత్వ వైఖరిని మంత్రి దుర్గేష్ వివరించారు. ఆర్థిక శాఖ మంజూరు అనుమతులు లేకుండా కొబ్బరికాయ ఎలా కొట్టారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలను మసిపూసి మారేడు కాయ చేశారే తప్ప కించిత్ అభివృద్ధి కూడా చేయలేదన్నారు. అభివృద్ధి చేయాలంటే పూర్తి స్థాయి అనుమతులు తప్పనిసరి అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని అనుమతులు వచ్చాకనే పనులు ప్రారంభించి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తుమన్నారు.

ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పుడే ఫలితం ఉంటుందని మంత్రి దుర్గేష్ వివరించారు. గతంలో 2014 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నిర్మించిన అనేక బిల్డింగులకు వైకాపా ప్రభుత్వం కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసి ప్రజల ఆరోగ్యమే ముఖ్యంగా భావించి వైద్య సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులను పలకరించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.

అంతకుముందు మంత్రి కందుల దుర్గేష్ కు నిడదవోలు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ, కౌన్సిలర్లు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link