పులివెందులలో ఒకరోజు ముందుగానే స్వాతంత్ర్యం

జగన్ అరాచక పాలనకు పులివెందులలో తెరపడింది

పులివెందుల జడ్పిటిసి లతా రెడ్డి విజయం చారిత్రాత్మకం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి
పులివెందుల జడ్పిటిసి పీఠం తెలుగుదేశం కైవసం చేసుకోవడంతో అక్కడి ప్రజలకు ఒకరోజు ముందుగానే స్వాతంత్ర్యం వచ్చినట్లు అయ్యిందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. గురువారం ఆయన తణుకులో మీడియాతో మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటే ఫలితం ఎలా వస్తుందో అనేది పులివెందుల జడ్పిటిసి ఎన్నిక నిరూపించిందని అన్నారు. అవినీతి, అక్రమాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన జగన్మోహన్ రెడ్డి జడ్పిటిసి ఎన్నిక ఏకగ్రీవం చేస్తూ వస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమానికి ఈ గెలుపు నిదర్శనమని అన్నారు. గత 30 సంవత్సరాలుగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబ పాలనలో నలిగిపోయిన పులివెందుల ప్రజలకు ఒకరోజు ముందుగానే స్వాతంత్ర్యం వచ్చినట్లు అయిందని అన్నారు. 30 ఏళ్లుగా జడ్పిటిసి ఎన్నిక జరగకుండా వారి దౌర్జన్యాలతో అక్రమాలతో పాలన సాగించిన పరిస్థితుల్లో అక్కడి ప్రజలు లతా రెడ్డిని గెలిపించుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సారధ్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి పులివెందుల గెలుపు నిదర్శనమని చెప్పారు. పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పు జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. గతంలో కుప్పం నియోజకవర్గంలో అక్రమాలతో అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచారని ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేశారు.

Scroll to Top
Share via
Copy link