తణుకు పట్టణంలోని పార్కుల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు – దాతలు సహకారం ఎంతో అవసరం – జిల్లాకలెక్టర్ చదలవాడ నాగరాణి

      

శుక్రవారం తణుకు పురపాలక సంఘ కార్యాలయం సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన పి-4 లక్ష్యంగా ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యం భాగంగా పార్కుల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు తణుకు శాసనసభ్యులు ఆరు మిల్లి రాధాకృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తణుకు పట్టణంలో పారిశ్రామికవేత్తలు, దాతలు పట్టణంలో పార్కులు, బస్ షెల్టర్స్, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. తణుకు పారిశ్రామికవేత్తలు, దాతలు ఎంతో చైతన్యతులని, సమాజాభివృద్ధికి తమ వంతు సహకారం అందించడానికి ముందు ఉంటారనేది అందరికీ తెలిసిందేనన్నారు. ఇటీవల కాలంలో దాతలు, పారిశ్రామికవేత్తల సహకారంతో భీమవరం పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సభలో వివరించారు. ప్రముఖంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కాస్మోపొలిటిన్ క్లబ్, భీమవరం హాస్పిటల్స్, లైన్స్ క్లబ్ తదితర దాతల సహకారం మరువలేనిదన్నారు. ఇతర దాతల సహకారంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇప్పటికే చేపట్టిన పనులు దాదాపు పూర్తికావచ్చాయని, కొన్నింటిని ప్రారంభించడం జరిగిందని కూడా తెలిపారు. ప్రభుత్వం ఒక్కటే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే సాధ్యం అయ్యే పని కాదని దీనికి దాతల సహకారం కూడా ఎంతో అవసరమని ఉన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి పి-4 విధానంలో అన్ని విధాల అభివృద్ధిని కాంక్షిస్తున్నారని, గత మాసం తణుకు పట్టణ పర్యటనలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారన్నారు. వారి లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమాజాభివృద్ధికి మనమందరం సహాయ సహకారాలను అందించి లక్ష్యాలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మీరందరూ మీ తణుకు పట్టణం అభివృద్ధికి కంకణబద్ధులై ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కృషి చేయాలని కోరారు. పట్టణంలోని పార్కులు, బస్సు షెల్టర్స్, ప్రభుత్వ వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఒక అవగాహన కలుగుతుందని, అ దిశగా ఆలోచన చేయాలన్నారు. ముఖ్యంగా పార్కులలో వాకింగ్ ట్రాక్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో ఆట స్థలాలు గుర్తించి వాటిలో కబాడీ, బ్యాట్మెంటన్, వాలీబాల్ ఆటలు ఆడే విధంగా తీర్చిదిద్దితే విద్యార్థులకు ఆటలపై మక్కువ ఏర్పడుతుందన్నారు. మీరు చేపట్టదలుచుకున్న పనుల వివరాలను మున్సిపల్ కమిషనర్ కు తెలియజేస్తే, ఆ మేరకు పట్టణాభివృద్ధికి ఒక కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి అమలు చేయడం జరుగుతుందన్నారు. తణుకు శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పి-4 కార్యక్రమంలో భాగంగా సంపన్నులు సహకారం, భాగస్వామ్యంతో సమాజంలోని అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా మనం అందరు కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తణుకు పట్టణ సుందరీకరణ, పార్కుల అభివృద్ధిని గత నెలలో ముఖ్యమంత్రి తణుకు పర్యటన సందర్భంగా ప్రస్తావించడం జరిగిందన్నారు. రామన్న రెండు, మూడు నెలల్లో పట్టణంలోని పార్కుల అభివృద్ధికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేయడం జరుగుచున్నదన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పారిశ్రామికవేత్తలు, దాతలు, ఎన్ ఆర్ ఐ లు తమ వంతు సహకారం అందించి పట్టణ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఇప్పటికే పట్టణంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించామన్నారు. పార్కులు అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టి పట్టణంలో మార్పు తీసుకురావాలనేదే నా ధ్యేయం అన్నారు. ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర లక్ష్యసాధనకు పారిశ్రామిక వేత్తలు, దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు.

తొలత మున్సిపల్ కమిషనర్ టి.రామకుమార్ తణుకు మున్సిపల్ పరిధిలో అభివృద్ధి చేయనున్న రెడ్డి అండ్ రెడ్డి లేఅవుట్, శ్రీ కుమార్ లేఅవుట్ వన్, తేతలి వీరరాఘవులు రెడ్డి లేఅవుట్ ఓపెన్ స్పేస్, కరుటూరి రంగారావు నగర్ లేఅవుట్, 17వ వార్డు మాంటిసోరి స్కూల్ వద్ద, యూ పి హెచ్ సి బ్యాక్ సైడ్, పైడిపర్రు చెరువు, రజకుల చెరువు, అరుంధతీయుల చెరువు, జనగం చెరువు, తదితర ప్రాంతాల్లో చేపట్టబోయే పార్కుల అభివృద్ధి, ఓపెన్ జిమ్, గ్రీనరీ, వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్ వర్క్, షటిల్, బ్యాట్మెంటన్, కబాడీ కోర్ట్ లు ఏర్పాటు పనులు, వాటి అంచనా వ్యయంపై సమావేశంలో పవర్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సమావేశంలో ఆంధ్ర షుగర్స్ జి.ఎం ఏ.సాంబశివరావు, అక్కమాంబ టెక్స్టైల్స్ లిమిటెడ్ ప్రతినిధులు ఎన్.కే మొహిద్దిన్, కే.రామకృష్ణ, ఎన్.కె మెరైన్స్ ప్రతినిధి వి.శ్రీనివాస్, జి.రాజేష్, దేవి సీఫుడ్స్ ప్రతినిధులు ఎన్.శివకుమార్, వై.కళ్యాణ్, ప్లటస్ టెక్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు సిహెచ్ ఫణింద్ర, ఎం.వెంకట్ రాజు, తదితరుల పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link