పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలి
ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధించి తద్వారా పారిశుద్ధ్యాన్ని క్రమబద్దీకరించాలని ప్రభుత్వం భావిస్తుంటే ప్రజల్లో ఇంకా మార్పు రావడంలేదని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోంచి తీసుకువచ్చిన చెత్తను రోడ్లుపై పోస్తుండటంతో పరిసరాలు దుర్ఘంధంగా మారుతున్నాయని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున మున్సిపల్ కమిషనర్ టి.రామ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ 24వ వార్డు కుమ్మర్ల వీధిలో పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపైనే స్థానికులు తమ ఇళ్లల్లో చెత్తను తీసుకువచ్చి పారబోయడాన్ని గమనించి పలు సూచనలు చేశారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించడానికి మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ వస్తున్నప్పటికీ వారికి ఇవ్వకుండా రోడ్డుపై పోస్తున్నారని అన్నారు. తణుకు పట్టణంలో నిత్యం దాదాపు 50 టన్నుల చెత్త వస్తోందని సిబ్బంది మాత్రం 180 మంది మాత్రమే ఉండటంతో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ పరిస్థితుల్లో ప్రజలు సహకరించి ఇంటింటికీ వచ్చే సిబ్బందికి చెత్తను ఇచ్చేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ప్లాస్టిక్ నిషేధానికి ప్రతిఒక్కరు సహకరించాలని సూచించారు. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తణుకు పర్యటనలో ప్లాస్టిక్ నిషేధానికి పిలుపు ఇచ్చారని ఎమ్మెల్యే రాధాకృష్ణ గుర్తు చేశారు.


