బీసీలకు న్యాయం చేయడానికి 34 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడిన ప్రభుత్వం

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్షాయనికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం తణుకులో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికారంలో తగిన వాటా కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలకు స్థానిక సంస్థల్లో అమలవుతున్న రిజర్వేషన్లు తగ్గించడంతో వారికి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం జీవో నంబర్లు 105, 106 విడుదల చేసి, రిజర్వేషన్లను 24 శాతం నుంచి 34 శాతానికి పెంచే ప్రయత్నం చేసిందన్నారు. అయితే, ఈ జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన చర్యలు చేపడతామని వెల్లడించారు.

బీసీల రిజర్వేషన్లపై రాజకీయ విమర్శలు

గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. 1994లో స్థానిక సంస్థల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్లు, 2014–2019 మధ్య వాటిని 34 శాతానికి పెంచినట్లు వివరించారు. అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఆరోపించారు. దీనివల్ల సుమారు 16 వేల మంది బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం దక్కకుండా పోయిందని విమర్శించారు. బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రాధాన్యత ఇస్తోందని, దివంగత నందమూరి తారక రామారావు హయాం నుంచి బీసీలకు రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నాలు జరిగాయని ఆయన తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐదేళ్ల పాలనలో బీసీ కార్పొరేషన్లకు తగిన నిధులు, వసతులు కల్పించలేదని ఆయన ఆరోపించారు. బీసీలకు కేటాయించిన బడ్జెట్‌ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని విమర్శించారు. సుమారు రూ.75 వేల కోట్ల బీసీ నిధుల కేటాయింపులకు సంబంధించి నిధుల వినియోగంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఎన్టీఆర్‌ విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేయడం వల్ల కూడా బీసీ విద్యార్థులకు నష్టం జరిగిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బీసీలపై దాడులు, హత్యలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, 76 మంది బీసీలు హత్యకు గురయ్యారని, సుమారు 2,500 మందిపై దాడులు జరిగాయని ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. టీడీపీ కార్యకర్త చంద్రయ్య హత్య, బీసీ యువకుడు అమర్నాథ్‌ గౌడ్‌ హత్య ఘటనలను కూడా ప్రస్తావిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేశారు.

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో బీసీల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు ఆయన తెలిపారు. తొలి బడ్జెట్‌లో సుమారు రూ.45 వేల కోట్లు, 2026–27 బడ్జెట్‌లో సుమారు రూ.51 వేల కోట్లు బీసీల సంక్షేమం, అభివృద్ధికి కేటాయించినట్లు పేర్కొన్నారు. కేటాయించిన నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ బీసీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే అవకాశాలు కల్పించేందుకు ఎన్టీఆర్‌ విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరించినట్లు ఆయన తెలిపారు. కులవృత్తులపై ఆధారపడి జీవిస్తున్న బీసీల ఆర్థికాభివృద్ధి కోసం ఆదరణ పథకాన్ని తిరిగి అమలు చేస్తూ, బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా సంప్రదాయ వృత్తిదారులకు అవసరమైన సహాయం అందించి, వారి వృత్తుల అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీసీలకు 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తూ, వారి హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top
Share via
Copy link