ఉపాధి హామీ స్థానంలో కొత్తగా తీసుకు వస్తున్న వి. బి.జి. రాం. జి పథకాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బళ్ళ చిన వీరభద్రరావు, సిపిఎం మండల కన్వీనర్ కామన మునిస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పర్యటనలో భాగంగా శనివారం మండలంలో ఏలేటిపాడు, రాపాక, కాకుల ఇల్లిందలపర్రు గ్రామలలో పనిచేస్తున్న ఉపాధి కూలీలను కలిసి వారితో కొద్దిసేపు ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా వీరభద్రరావు, మునిస్వామి మాట్లాడుతూ అనేక ఉద్యమ పోరాటాల ద్వారా 2005లో అమల్లోకి వచ్చిన ఉపాధి హామీ చట్టం పేద కుటుంబాలకు 100 రోజులు పని కల్పిస్తూ గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నా వి. బి.జి. రాం. జి కొత్త పథకం వలన కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త పథకంలో ఏడాదిలో రెండు నెలలపాటు పనులను నిలిపివేసే నిబంధనలు ఉండడంతో వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం వలసలు వెళ్ళవలసిన పరిస్థితి వస్తుందని వారు పేర్కొన్నారు. ఉపాధిహామీలో అవినీతి జరుగుతుందన్న పేరుతో పేస్ యాప్ పెట్టి కూలీలను వేధిస్తున్నారని ఉన్నతస్థాయిలో అవినీతిని అరికట్టకుండా ఇంటిలో ఎలకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టిన చందముగా ఉపాధి కూలీలపై నెపం వేయడం సమంజసం కాదని వారన్నారు ఫేస్ యాప్ పెట్టడం వలన పని ప్రదేశాల్లో నెట్ సరిగా లేకపోవడం కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని కాబట్టి తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పితాని మధు, రాజు, చంద్రకళ, రమణమ్మ, తులసి, సత్యనారాయణ, వెంకటలక్ష్మి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



