ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తణుకు కార్గో కార్యాలయంలో తణుకు లావణ్య ఫీడ్స్ యజమాని కోసూరి సతీష్ వర్మ ఆర్థిక సహాయంతో చల్లని మంచినీళ్ల చలివేంద్రం ను డిపో మేనేజర్ A. D. L.సుధారాణి ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలుగా కార్గో వినియోగదారులు మరియు హమాలీలు ఆపరేటర్ల వేసవి దాహార్తిని తీర్చడానికి సతీష్ వర్మ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారని ఇది చాలా అభినందనీయమని అన్నారు. ఈరోజు సతీష్ వర్మ కుమారుని పుట్టినరోజు సందర్భంగా రహదారి ప్రమాదంలో గాయపడ్డ హమాలి వెంకన్నకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారని, కార్గో సిబ్బంది కి ఎప్పుడు ఎటువంటి సహాయం అవసరం అయినా సతీష్ వర్మ ముందుంటున్నారని ఇటువంటి వినియోగదారులను కలిగి ఉండడానికి తణుకు కార్గో సిబ్బంది పనితీరు కారణం అని సిబ్బందిని డిపో మేనేజర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, ఆయిల్ డీసీ మహమ్మద్ ఆలీ, సీనియర్ డ్రైవింగ్ ఇన్స్రక్టర్ కళ్యాణ్ రాజు, సిస్టమ్ ఇంచార్జి సాయికుమార్ , డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, హమాలీలు, ఆపరేటర్లు, మరియు డిపో సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో దాతల సహాయం తో బస్టాండ్ ప్రాంగణంలో మజ్జిగ చలివేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని డిపో మేనేజర్ సుధారాణి తెలిపారు.




