రైతుల సమక్షంలోనే రీ సర్వే కొలతలు చేపట్టాలి
గ్రౌండ్ ట్రూతింగ్ పనులను పరిశీలించిన కలెక్టర్
సచివాలయ సేవల్లో జవాబుదారీతనం, పారదర్శకత అవసరం
రైతులతో ముఖాముఖి – రీ సర్వేపై వివరాలు తెలుసుకున్న కలెక్టర్ కీర్తి చేకూరి
ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పనులను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు.
క్షేత్ర స్థాయిలో నిర్వహిస్తున్న సర్వే ప్రక్రియను సమగ్రంగా పరిశీలించి, మార్గదర్శకాల ప్రకారం పనులు సక్రమంగా జరుగుతున్నాయా అనే అంశంపై అధికారులను వివరంగా ఆరా తీశారు.
ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించిన కలెక్టర్ కీర్తి చేకూరి, రీ-సర్వే సమయంలో వారికి ముందస్తు సమాచారం అందుతున్నదా, కొలతలు వారి సమక్షంలోనే తీసుకుంటున్నారా, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి వంటి విషయాలను ప్రశ్నించారు. దీనిపై రైతులు సానుకూలంగా స్పందిస్తూ, అధికారులు పారదర్శకంగా సర్వే నిర్వహిస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, భూముల రీ-సర్వే ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేశారు. ప్రతి రైతుకు సరైన సమాచారం అందించడంతో పాటు, వారి సమక్షంలోనే కొలతలు చేపట్టాలని, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
అలాగే గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై కూడా సమీక్ష నిర్వహించారు. గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న 11 మంది కార్యదర్శుల విధులు ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చూడాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి నుంచి డిజిటల్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ, గ్రామ ప్రజలకు అవసరమైన సేవలను సమయానికి అందించాలని చెప్పారు.
సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న పౌర సేవలపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నదని పేర్కొంటూ, ప్రతి ఉద్యోగి విధి నిర్వహణలో జవాబుదారీతనం, పారదర్శకత పాటించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు.
ఈ పర్యటన లో కలెక్టర్ వెంట కొవ్వూరు ఆర్డీవో కె. ఆనందరావు, జిల్లా సర్వే అధికారి బి. లక్ష్మీ నారాయణ, తహసిల్దార్ ప్రసాద్, సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారి, గ్రామ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు


