కంసాలిపాలెంలో బాబూజీ 119వ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన మంత్రి దుర్గేష్
కంసాలిపాలెంలో దళిత వర్గాల కోసం కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు హామీ
కంసాలిపాలెం దళితవాడలను అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని వెల్లడి
నిడదవోలు: “దళిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు జగ్జీవన్ రామ్ అని, ఆయన స్ఫూర్తితోనే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తోంది” అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక విప్లవకారుడు, భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా నిడదవోలు రూరల్ మండలం కంసాలిపాలెంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ బాబూజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం ఉద్యమకారుడిగా, అనంతరం భారత దేశరక్షణ, వ్యవసాయ శాఖల మంత్రిగా బాబూజగ్జీవన్ రామ్ చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. భారత్-పాక్ యుద్ధ సమయంలో రక్షణ మంత్రిగా బాబూజీ ప్రదర్శించిన ధైర్యసాహసాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని మంత్రి దుర్గేష్ గుర్తుచేశారు. అందుకే ఇందిరాగాంధీ సైతం ఆయన్ని గౌరవపూర్వకంగా ‘బాబూజీ’ అని పిలిచేవారని వివరించారు. అలాంటి మహనీయుడి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించే భాగ్యం కలిగినందుకు ఆనందంగా ఉందన్నారు.
బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని కంసాలిపాలెం గ్రామఅభివృద్ధికి మంత్రి కందులదుర్గేష్ పలుహామీలు ఇచ్చారు. దళిత వర్గాల కోసం 3, 4 నెలల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే కార్యాచరణ సిద్ధమైందన్నారు. యువత కోసం త్వరలోనే ఆటస్థలాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో దళిత, బలహీన వర్గాల సాధికారతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గ ప్రజలకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని హామీ ఇచ్చారు. “అవమానాలను ఎదుర్కొని విజయాలుగా మలుచుకున్న గొప్పయోధుడు బాబూజీ. ఆయన క్రమశిక్షణ, దేశభక్తి భావితరాలకు మార్గదర్శకం, కంసాలిపాలెం దళితవాడలను అత్యద్భుతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం” అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. జై బాబూజీ.. జోహార్ బాబు జగ్జీవన్ రామ్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమంలో భారీసంఖ్యలో గ్రామస్థులు పాల్గొని మంత్రి కందుల దుర్గేష్ కి ఘనస్వాగతం పలికారు.


