పీ4 వార్షికోత్సవంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబునాయుడుకి నియోజకవర్గ వివరాలు వెల్లడించిన మంత్రి కందుల దుర్గేష్
పేదరిక నిర్మూలనే లక్ష్యంగా నిడదవోలులో 10,263 ‘బంగారు కుటుంబాల’ గుర్తించామని వెల్లడి
దాతలు, సంస్థల భాగస్వామ్యంతో అభివృద్ధి పథంలో నిడదవోలు సాగుతుందని తెలిపిన మంత్రి దుర్గేష్
నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న పీ4 పురోగతిపై సీఎం సంతృప్తి
శానిటేషన్ యూనిట్లతో బాలికల డ్రాపౌట్ తగ్గడం, నెస్ట్లే కంపెనీ చొరవను అభినందించిన సీఎం చంద్రబాబునాయుడు
నిడదవోలు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4 (P4 – Public-Private-People Partnership) కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గంలో అద్భుత ఫలితాలను ఇస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం జరిగిన పీ4 వార్షికోత్సవాల్లో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నియోజకవర్గ ప్రగతి వివరాలను వెల్లడించారు. నియోజకవర్గంలో మొత్తం 10,263 బంగారు కుటుంబాలను గుర్తించామని, 4,147 కుటుంబాలను దాతలు, సంస్థలు దత్తత తీసుకున్నాయని తెలిపారు. పీ4 లక్ష్యాల సాధనలో 744 మంది మార్గదర్శకులు చురుకైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.
నిడదవోలు నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనకు అనేక సంస్థలు, వ్యక్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని మంత్రి కందుల దుర్గేష్ సీఎంకు వివరించారు. ముఖ్యంగా నెస్ట్లే ఇండియా లిమిటెడ్ సుమారు రూ. 30 లక్షలతో పలు పాఠశాలల్లో 15 మాడ్యులర్ శానిటేషన్ యూనిట్లను నిర్మించారని తద్వారా బాలికల్లో డ్రాపౌట్ శాతం గణనీయంగా తగ్గిందని తెలిపారు. నున్న ధనలక్ష్మి (గోపవరం) అనే మహిళ గ్రామీణ పరిశుభ్రత కోసం రూ. 10.50 లక్షలతో ట్రాక్టర్, ట్రాలీని విరాళంగా ఇచ్చారని వెల్లడించారు. కారంకి శివ కుమార్ (కోరుపల్లి) అనే వ్యక్తి ఒక బంగారు కుటుంబం జీవనోపాధి కోసం తనకున్న 40 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారని తద్వారా ఆ కుటుంబానికి ఉపాధి మార్గం చూపించారన్నారు.స్వయం సమృద్ధి సాధించేందుకు తనకున్న 40 సెంట్ల భూమిని సాగు కోసం అప్పగించడం ఒక గొప్ప మలుపు అని తెలిపారు. దాస్యం సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వెల్ నెస్ సెంటర్ నిర్మాణం కోసం 10 సెంట్ల భూమిని కొని ప్రభుత్వానికి ఇచ్చారని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పించి వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. కూలెక్స్ ఇండస్ట్రీస్ (ఫుడ్ ప్రాసెసింగ్), ఇన్ ఫైవర్స్ సొల్యూషన్స్ (ఏఐ, డిజిటల్ మార్కెటింగ్) సంస్థలు స్థానిక యువతకు, మహిళలకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ ఇస్తున్నాయని వివరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో విద్యార్థిని తేజస్విని సంభాషణ..బాగా చెప్పావమ్మ అంటూ అభినందన:
నెస్ట్లే కంపెనీ నిర్మించిన శానిటేషన్ బ్లాక్‌ల వల్ల కలిగిన ప్రయోజనాన్ని నిడదవోలు జెడ్పీ గర్ల్స్ స్కూల్ విద్యార్థిని తేజస్విని (9వ తరగతి) ముఖ్యమంత్రికి వివరించింది. “గతంలో టాయిలెట్లు లేక సమయం వృధా అయ్యేదని, ఇప్పుడు సౌకర్యాలు బాగుండటంతో క్లాసులకు త్వరగా వెళ్తున్నామని, పీ4 దేశంలో మార్పుకు నాంది” అని పేర్కొంది. చిన్నారి స్పందనకు ముగ్ధుడైన సీఎం చంద్రబాబునాయుడు ఆమెను “బాగా చెప్పావమ్మ” అంటూ ప్రత్యేకంగా అభినందించారు.
నెస్ట్లే ఇండియా సామాజిక బాధ్యతను ప్రశంసించిన సీఎం చంద్రబాబునాయుడు:
నియోజకవర్గంలోని 15 పాఠశాలల్లో రూ. 30 లక్షలతో 15 మాడ్యులర్ శానిటేషన్ యూనిట్లు నిర్మించడమే కాకుండా, 2025లో 4 జిల్లాల్లోని 15 స్కూళ్లలో మొత్తం 53 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు నెస్ట్లే మేనేజర్ వెల్లడించారు. వీధి వ్యాపారులకు వసతులు, సైక్లోన్ బాధితులకు (6000 మందికి) సాయం వంటి అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం:
నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న పీ4 పురోగతిపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. నెస్ట్లే కంపెనీ సేవలను అభినందిస్తూ, మరో 200-500 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని సూచించారు. “మన ఆదాయంలో 10 శాతం పేదల కోసం ఖర్చు చేస్తే వచ్చే తృప్తి వెలకట్టలేనిది. సమాజం నుంచి లబ్ధి పొందిన వారు అసమానతలు తగ్గించేందుకు ముందుకు రావాలి. జీరో పావర్టీ సాధ్యమే” అని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వంలో నిడదవోలులో పీ4 కార్యక్రమం మరింత వేగంగా సాగాలని సీఎం ఆకాంక్షించి ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేసీ, ఆర్డీవోలు, బంగారు కుటుంబాలు మరియు మార్గదర్శకులు పాల్గొన్నారు


