నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ విస్తృత పర్యటన
పెండ్యాల, మునిపల్లి గ్రామాల్లో ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి దుర్గేష్
పెండ్యాల గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన చిన్న పుంత రోడ్డును పరిశీలించిన మంత్రి దుర్గేష్..దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పుంత రోడ్డు పనులు పూర్తి కావడంతో హర్షం వ్యక్తం చేసిన స్థానిక రైతాంగం..మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు
నిడదవోలు: నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ఆదివారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు ఆధ్యాత్మిక మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
తొలుత నిడదవోలు రూరల్ మండలం పెండ్యాల గ్రామంలోని గౌడ రామాలయం వద్ద నిర్వహించిన అన్నసమారాధాన కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం పెండ్యాల గౌడ సంఘం సభ్యులు మంత్రి దుర్గేష్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పెండ్యాల గౌడ సంఘం వారు భక్తిశ్రద్ధలతో ఈ అన్నసమారాధాన కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని మంత్రి దుర్గేష్ అన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సేవా భావాన్ని పెంచుతాయని, కులమతాలకు అతీతంగా అందరూ కలిసి మెలిసి ఉండాలనే సంకల్పాన్ని ఇవి బలపరుస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పెండ్యాల గ్రామంలో రూ.25 లక్షల ఎంపీ ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో ఇటీవల నూతనంగా నిర్మించిన చిన్న పుంత రోడ్డును మంత్రి దుర్గేష్ పరిశీలించారు.సాధారణమైన మట్టి రోడ్లను శాశ్వతమైన తారు రోడ్లుగా మార్చే డబ్ల్యూబీఎం పద్ధతిలో నిర్మించిన రోడ్డును నిశితంగా పరిశీలించి, పనుల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన మిగిలిన అభివృద్ధి పనులను కూడా సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి దుర్గేష్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పుంత రోడ్డు పనులు పూర్తి కావడంతో స్థానిక రైతాంగం మరియు గ్రామస్థులు మంత్రి దుర్గేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. పొలాలకు వెళ్లే దారి సుగమం కావడంతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయని రైతులు తమ ఆనందాన్ని పంచుకున్నారు.పర్యటనలో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురిని పరామర్శించి ధైర్యం చెప్పారు.. శుభకార్యాలకు హాజరయ్యారు.
అనంతరం జనసైనికుల ఆహ్వానం మేరకు మునిపల్లి గ్రామాన్ని సందర్శించిన మంత్రి దుర్గేష్ స్థానిక గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా “ఆధ్యాత్మికతతో పాటు అభివృద్ధి కూడా మన లక్ష్యం. ఒకవైపు దేవాలయాలను, సాంస్కృతిక కార్యక్రమాలను గౌరవిస్తూనే, మరోవైపు రైతులకు ఉపయోగపడే పుంత రోడ్ల వంటి మౌలిక సదుపాయాలను కల్పించడంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది” అని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
ఈ పర్యటనలో స్థానిక కూటమి నాయకులు, జనసైనికులు, ప్రభుత్వ అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొన్నారు.


