ముస్లింలకు కూటమి ప్రభుత్వం అండ

మతసామరస్యాన్ని కాపాడే రంజాన్‌

తణుకులో ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్యే రాధాకృష్ణ

నాలుగో వార్డులో రంజాన్‌ తోఫా పంపిణీ

ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు

కూటమి ప్రభుత్వంలో ముస్లిం సోదరులకు సంక్షేమం అందజేస్తూ వారి మత విశ్వాసాలను కాపాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకులో మంగళవారం నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఆయన పాల్గొని మాట్లాడారు. మత సామరస్యాన్ని కాపాడే రంజాన్‌ పండుగ ద్వారా సమాజంలో వర్గ విబేధాలు లేకుండా ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందు ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌లు నేతృత్వంలో షాదీఖానాలు నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. గత టిడిపి ప్రభుత్వ హాయంలో హైదరాబాదులో మక్కా భవనం నిర్మించి ప్రస్తుతం గుంటూరులో నూతనంగా మక్కా భవనం నిర్మించారని గుర్తు చేశారు. మక్కా వెళ్లే ముస్లిం సోదరులకు రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో ప్రతి ఏటా అందిస్తున్నట్లుగానే దాదాపు 1700 కుటుంబాలకు రంజాన్‌ తోఫాను ఈ ఏడాది కూడా అందించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి నాలుగో వార్డులో రంజాన్‌ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు. స్థానికంగా తన సొంత ఖర్చుల నుంచి రంజాన్‌ తోఫాను ప్రతి కుంటుంబానికి అందజేస్తానని ఎమ్మెల్యే రాధాకృష్ణ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link