పెండ్యాల గ్రామంలో వంగవీటి రాధాతో కలిసి రంగా విగ్రహావిష్కరణ చేసిన మంత్రి దుర్గేష్
రూ. 2.83 కోట్లతో పెండ్యాల గ్రామాన్ని అభివృద్ధి చేశామని వెల్లడి – గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు హామీ ఇచ్చిన మంత్రి దుర్గేష్
వంగవీటి రంగా ఆశయాలే లక్ష్యంగా ముందుకు సాగుతానని వెల్లడి.
నిడదవోలు:బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి స్వర్గీయ వంగవీటి మోహన రంగా గారు పెద్దోడిని కొట్టి పేదోడికి పెట్టిన “ఆధునిక రాబిన్ హుడ్” అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ కొనియాడారు. శనివారం నిడదవోలు రూరల్ మండలం పెండ్యాల గ్రామంలో వంగవీటి మోహన రంగా తనయుడు వంగవీటి రాధాతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. వంగవీటి మోహన రంగా అందరివాడని, ఆయన పేరు వింటేనే నేటికీ యువతలో ఒక ప్రత్యేకమైన ఉత్తేజం వస్తుందని పేర్కొన్నారు. కేవలం మూడున్నరేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, 50 ఏళ్లు పదవిలో ఉన్నవారు కూడా సాధించలేని ప్రజాభిమానాన్ని ఆయన సొంతం చేసుకున్నారని తెలిపారు. కులమతాలకు అతీతంగా పేదవాడి కష్టాన్ని తన కష్టంగా భావించి పోరాడిన నిజమైన ప్రజా నాయకుడు రంగా అని అభివర్ణించారు. “పులి కడుపున పులే పుడుతుంది” అన్నట్లుగా వంగవీటి రాధా కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, నిస్వార్థంగా ప్రజాసేవ చేయడం ఆదర్శనీయమని మంత్రి కొనియాడారు. రంజిత మానస ప్రమోద చిహ్నంగా ఉద్భవించిన నాయకులు వంగవీటి మోహన రంగా అని మంత్రి దుర్గేష్ అభివర్ణించారు. . తన చివరి శ్వాస వరకు పేదల కోసం బతికిన ప్రజా నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా అన్నారు.తండ్రిలాగే తనయుడు వంగవీటి రాధ రాష్ట్రస్థాయి నాయకుడుగా ఎదగాలన్నదే తన ఆకాంక్షని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు..తన దగ్గరకు వచ్చే వారు ఎవరని చూడకుండా వచ్చిన వారు పేదవాడైతే చాలు, కష్టంలో ఉంటే చాలు వారి సమస్య విని ఎంతటి పెద్దోడితో అయినా పోరాడి సమస్యకు పరిష్కారం చూపిన నిజమైన నాయకులు రంగా అన్నారు. ఆయన పేదల పక్షపాతి కాబట్టే రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఉన్నారన్నారు. ఏ మూలన రంగా విగ్రహం పెట్టినా తనకు కుదరదు, రాను అని చెప్పలేదని ఆయన తనయుడు రాధ గురించి వివరించారు. తాను గతంలో ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యానంటే అందులో నాటి ఎమ్మెల్యేగా పనిచేసిన రాధా ఓటు ఉందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.తాను వంగవీటి మోహన రంగ మార్గదర్శకత్వాన్ని తీసుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల్లో తన జీవితాన్ని కొనసాగిస్తున్న నాయకుడిని అన్నారు. గత నెలలో ఇదే గ్రామంలో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ చేశానన్నారు..ఈ ఇద్దరి విగ్రహాల ఆవిష్కరణ తనకు దొరికిన అదృష్టం అన్నారు. ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు రూరల్ మండలాల అభివృద్ధికి, నిడదవోలు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి దిశగా కృషి చేస్తానని మంత్రి దుర్గేష్ హామీ ఇచ్చారు.
పెండ్యాల గ్రామానికి అభివృద్ధి పండుగ:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండ్యాల గ్రామానికి ఇప్పటి వరకు రూ. 2.83 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేశామని మంత్రి దుర్గేష్ వివరించారు. పల్లెపండుగ 1.0 క్రింద రూ.16.50 లక్షలతో రోడ్లు, పల్లెపండుగ 2.0 క్రింద రూ.45.50 లక్షలు ఖర్చు చేశామన్నారు. ఎంపీ ఎన్ఆర్ఈజీఎస్ క్రింద పుంత రోడ్లకురూ.25 లక్షలు మంజూరు చేశామని త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీ రాజ్ సాధారణ నిధుల నుండి రూ.18.10 లక్షలు ఖర్చు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని అదే విధంగా జేజేఎం క్రింద రూ.29.30 లక్షలు, డీఎంఎఫ్ క్రింద రూ.25 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మండల ప్రజా పరిషత్ నిధుల నుండి రూ.35.10 లక్షలు, 4 గోకులం షెడ్లకు రూ.8 లక్షలు ఖర్చు చేశామన్నారు. అదే విధంగా శాస్కి స్కీమ్ క్రింద రూ.80 లక్షలతో మార్టేరు- ప్రక్కిలంక రోడ్ నుండి కోరుపల్లి వయా పెండ్యాల రోడ్డును మంజూరు చేశామన్నారు ఇవే గాక ఆర్ అండ్ బీ నిధులు రూ 4.15 కోట్లతో పెండ్యాల నుండి జీడిగుంట రోడ్ నిర్మాణం చేపట్టామన్నారు. సీఎంఆర్ఎఫ్ క్రింద 11 మంది లబ్ధిదారులకు ఈ గ్రామంలో రూ.5.84 లక్షలు అందించినట్లు తెలిపారు.అదే విధంగా ఎల్ వోసీ క్రింద 3.11 లక్షలు, ప్రత్యేక ఆర్థిక సాయం క్రింద వైద్య ఖర్చులకు రూ.3.60 లక్షలు మొత్తంగా 12.44 లక్షలు అందించామన్నారు. రాబోయే రోజుల్లో పెండ్యాలలో అనేక కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ప్రజల విజ్ఞప్తి మేరకు గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో కమ్యూనిటీ హాల్ లను ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో వంగవీటి రాధా, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, కూటమి నాయకులు మరియు రంగా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


