ఏపీ పర్యాటక రంగానికి ఏపీటీడీసీ వెన్నెముక

:- పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

భవాని ద్వీపంలో ఘనంగా ఏపీటీడీసీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ గత ఐదు దశాబ్దాలుగా రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఏర్పాటై 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా బుధవారం విజయవాడలోని భవానీద్వీపంలో నిర్వహించిన స్వర్ణోత్సవ సంబరాల్లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, పర్యాటకశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, ఏపీటీడీసీ ఎండి ఆమ్రపాలి కాటతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ భవాని ఐల్యాండ్ కి వచ్చారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏపీటీడీసీ 50 ఏళ్ల లోగోను మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. ఏపీటీడీసీ ప్రస్థానాన్ని తెలిపేలా రూపొందించిన ఏవీని ఆసక్తిగా తిలకించారు. ఏపీటీడీసీ చైర్మన్, ఉన్నతాధికారులతో కలిసి గాల్లోకి బెలూన్స్ ఎగరవేశారు. అనంతరం 50 ఏళ్ళ పర్యాటకాభివృద్ధి సంస్థ విజయగాథను వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేసారు..

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 1976 ఫిబ్రవరి 18న పరిమిత సేవలతో ఏర్పాటైన ఏపీటీడీసీకి అంచెలంచెలుగా అభివృద్ధి చెంది నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకొని స్వర్ణోత్సవ సంబురాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో నిరాదరణకు గురైన పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేవలం 18 నెలల కాలంలోనే 117 ప్రఖ్యాత సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకొని రూ.20,088 కోట్ల పర్యాటక పెట్టుబడులు ఆకర్షించామని , 1,22,637 ఉద్యోగాల కల్పనకు మార్గం సుగమం చేశామన్నారు. ప్రస్తుతం రూ. 6681 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో, అడ్వెంచర్, హెరిటేజ్, వెల్నెస్, మెడికల్, కల్చర్, ఫిల్మ్, క్రూయిస్ తదితర విభిన్న పర్యాటక ప్రక్రియలను చేపట్టడంతో పాటు హోమ్ స్టే, టెంట్ సిటీస్, క్యారవాన్, హౌస్ బోట్స్, నిత్యం ఈవెంట్స్, ఫెస్టివల్స్, జాతీయ, అంతర్జాతీయ రోడ్ షోలు, సదస్సులు తదితర వినూత్న కార్యక్రమాలతో పర్యాటకశాఖ ముందుకు సాగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పన, నూతన పర్యాటక పాలసీ 2024-29 విడుదల, ఇన్వెస్టర్లకు ఆకర్షణీయమైన రాయితీలు కల్పించడం వంటి అంశాలతో ప్రస్తుతం పర్యాటక రంగానికి స్వర్ణ యుగం నడుస్తుందన్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే తమ లక్ష్యమన్నారు. భవిష్యత్తులో ఒకే ఒక ఇజం ఉంటుంది అదే టూరిజం అని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ నినదించారు.ఆర్ధికాభివృద్ధి, ఉపాధి కల్పన, సాంస్కృతిక మార్పిడి లక్ష్యంగా ముందుకు వెళ్తాన్నామన్నారు..

ఐదు దశాబ్దాల అద్భుత ప్రస్థానం:

1976లో కేవలం రూ. 13 లక్షల మూలధనంతో ప్రారంభమైన ఏపీటీడీసీని నేడు రూ. 20,000 కోట్ల పెట్టుబడులకు బాటలు వేశామని మంత్రి దుర్గేష్ అన్నారు. నేడు దేశంలోనే అత్యధికంగా పర్యాటకులు సందర్శించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ను 4వ స్థానంలో నిలిపామన్నారు.. ఏ ప్రైవేట్ సంస్థ సాహసించని సమయంలో శ్రీశైలం, అరకు, గండికోట వంటి మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, పర్యాటక మార్కెట్‌ను సృష్టించిన ఘనత ఏపీటిడిసీదే అని మంత్రి దుర్గేష్ కొనియాడారు.

కేంద్ర ప్రభుత్వ భారీ సహకారం:

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా పర్యాటక రంగానికి కేంద్రం నుండి రూ. 428 కోట్ల భారీ గ్రాంట్ లభించిందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు. తద్వారా 8 పర్యాటక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా
రూ. 97.52 కోట్లతో సూర్యలంక బీచ్, రూ. 94.44 కోట్లతో అఖండ గోదావరి పునరుద్ధరణ, రూ. 77.91 కోట్లతో గండికోట గార్జ్ ఎక్స్‌పీరియన్స్, రూ. 54.04 కోట్ల ప్రసాద్ స్కీం నిధులతో సింహాచలం అభివృద్ధి, రూ. 79.83 కోట్లతో బొర్రా గుహలు, అహోబిలం, నాగార్జున సాగర్ లను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఈ ప్రాజెక్టులన్నీ జూలై 2026 నాటికి పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ ప్రకటించారు.

సంక్షోభంలోనూ వెనకడుగు వేయని సంస్థ:

కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో పర్యాటక ఆదాయం సున్నా అయినప్పటికీ, ఏపీటీడీసీ ఉద్యోగులు ప్రాణాలకు తెగించి ఆసుపత్రులకు, క్వారంటైన్ సెంటర్లకు ఆహారం సరఫరా చేశారని మంత్రి దుర్గేష్ గుర్తు చేశారు. ఆ సమయంలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బంది త్యాగాలను స్మరిస్తూ సభలో 2 నిమిషాల మౌనం పాటించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

భవిష్యత్తు లక్ష్యాలు – స్వర్ణాంధ్ర 2047:

రూ. 20,088 కోట్ల విలువైన 117 ప్రాజెక్టుల ద్వారా 1.22 లక్షల ఉద్యోగాల కల్పనను ఏడాదిన్నర కాలంలోనే సాధించామన్నారు. 2025-26లో 4,597 క్లాసిఫైడ్ రూమ్స్ మంజూరు (ఇది దేశం మొత్తంలో మూడవ వంతు). సీ క్రూయిజ్, హెలీ-టూరిజం, కారవాన్ టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్ వంటి ఆధునిక పర్యాటక అనుభవాలను పర్యాటకులకు అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు.

ఉద్యోగుల సంక్షేమం:

సగటున 30 ఏళ్ల సుదీర్ఘ కాలం సంస్థకు సేవలు అందిస్తున్న ఉద్యోగులే ఏపీటీడీసీకి నిజమైన బలమని మంత్రి దుర్గేష్ ప్రశంసించారు. ఉద్యోగుల జీతాల పెంపు, ఇన్సూరెన్స్ మరియు మెరుగైన పని వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

“ఏపీటీడీసీ ఒక సాధారణ సంస్థ కాదు, అదొక బలమైన కుటుంబం. గడచిన 50 ఏళ్లు ఒక స్వర్ణ అధ్యాయమైతే.. ఇకపై ప్రారంభం కాబోయేది వజ్ర అధ్యాయం. ఏపీని దేశంలోనే నంబర్ 1 పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దుదాం.” అని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. సాధించాల్సింది చాలా ఉందన్నారు.

ఈ సందర్భంగా భవాని ద్వీపంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి.. మంత్రి కందుల దుర్గేష్ ఆద్యంతం ఉత్సాహంగా గడిపారు. ప్రతిభ కనబరిచిన చిన్నారులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.

ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ..గడిచిన 50 ఏళ్లలో ఏం సాధించాం, రాబోయే రోజుల్లో ఏం చేస్తాం అనే విషయాలను బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.గత ప్రభుత్వంలో పర్యాటక విధ్వంసం జరిగింది అని విమర్శించారు.. పర్యాటక శాఖకు అత్యధిక రెవెన్యూ ఇచ్చే హరితా రిసార్ట్స్ స్థానంలో రుషికొండ ప్యాలెస్ నిర్మించడం దుర్మార్గం అన్నారు.. పర్యాటకుల ఆహ్లాదం కోసం ఈ రంగానికి సీఎం పెద్దపీట వేసారన్నారు. సీఎం అన్నట్లుగా భవిష్యత్ అంతా టూరిజందే అన్నారు. నాటి ఎండీ ఆంజనేయ రెడ్డి లా పనిచేయాలని పలువురు సూచిస్తున్నారంటే ఆయన పనితీరు ను పుణికిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఏ రంగం లో ఉన్నా మనదైన మార్క్ చూపించాలన్నారు. గతంలో తాను బోర్డు మెంబెర్ గా ఉండి మా సొంత నియోజకవర్గం అయిన కందుకూరుకు ఒక కాలేజీ సాధించడం సంతృప్తిన్నిచ్చిందన్నారు.

పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ మాట్లాడుతూ ఏపీటీడీసీ 50 ఏళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకోవడం గొప్ప విషయం అన్నారు.. ప్రతి ఏటా ఈ కార్పొరేషన్ మరింత బలంగా మారుతోందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యాటక శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. రాబోయే పదేళ్లలో 1000-2000 కోట్ల టర్నోవర్ సాధించే సంస్థగా రూపాంతరం చెందాలని సీఎం సూచించారన్నారు. టూరిజం తమకు తొలి ప్రాధాన్యత అన్నారు.ఉద్యోగులు మరింత కష్టపడి సంస్థ పురోగతిలో భాగస్వామ్యం కావాలన్నారు.

ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు ఏపీటీడీసీ వేదిక అయిందన్నారు.. ఏపీటీడీసీని మార్కెట్ క్రియేటర్ గా అభివర్ణించారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యంలో లేని ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించిన ఘనత ఏపీటీడీసీ ది అన్నారు. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టలేని ప్రాంతాల్లో ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్ పెట్టిందని గుర్తు చేశారు. ఏపీటీడీసీ ఉద్యోగులు రియల్ హీరోస్ అని కొనియాడారు. ప్రస్తుతం పీపీపీ విధానంలో ముందుకు వెళ్తున్నామన్నారు. 2040 నాటికీ మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు..

ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, ఏపీటీడీసీ ఎండీ, రిటైర్డ్ ఉద్యోగులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link