కొండవీడు కోట చారిత్రక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

*కొండవీడు ఘాట్ రోడ్డు నిర్మాణం అద్భుతం – ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుపై ప్రశంసల జల్లు

కొండవీడు అభివృద్ధికి కేంద్రం నుండి రూ. 110 కోట్ల నిధుల సాధనకు కృషి చేస్తామని హామీ

పర్యాటక క్యాలెండర్‌లో ‘కొండవీడు ఉత్సవాలు’ చేరుస్తామని వెల్లడి

నరసరావుపేట (పల్నాడు జిల్లా):చారిత్రక వారసత్వ సంపదకు నిలయమైన కొండవీడు కోట వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా పర్యాటక రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో నిర్వహిస్తున్న కొండవీడు కోట ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి కొండపై ఉన్న చెరువులో బోటింగ్ చేయడమే కాకుండా, అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను, ఫల ప్రదర్శనలను మరియు సైకత శిల్పాలను సందర్శించి ఆనందం వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనులపై ప్రశంసలు

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కొండవీడు ఘాట్ రోడ్డును చరిత్రలో నిలిచిపోయేలా తీర్చిదిద్దిన తీరును కొనియాడారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కృషిని, జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల మరియు యంత్రాంగం యొక్క సమన్వయాన్ని ఆయన అభినందించారు. కొండవీడు కోటలో రాజుల కాలం నాటి ‘వాటర్ మేనేజ్మెంట్’ (నీటి నిర్వహణ) ప్లానింగ్ అద్భుతమని, దానిని నేటి తరానికి వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు

గడిచిన ఐదేళ్లలో పర్యాటక రంగం కుంటుబడిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. కళాకారులను, సాహిత్యాన్ని గత ప్రభుత్వం విస్మరించిందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పర్యాటకానికి పునర్జీవం పోసిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు, మంత్రి లోకేష్ సమర్థతతో పర్యాటక రంగం పరుగులు పెడుతోందని తెలిపారు.

పర్యాటక సర్క్యూట్ కు మరియు నిధుల మంజూరుకు హామీ

కొండవీడు కోట అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమర్పించిన డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కేంద్రం నుండి రూ. 110 కోట్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కొండవీడు, అమరావతి బుద్ధిస్ట్ సర్క్యూట్ మరియు కోటప్పకొండలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు. పిపిపి పద్ధతిలో రిసార్టులు, స్టార్ హోటళ్ల నిర్మాణం ద్వారా ఉపాధి కల్పిస్తామని, ఇందుకోసం ఇప్పటికే రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని తెలిపారు.

కొండవీడు కోట ఫెస్టివల్ సందర్భంగా పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్, ట్రెక్కింగ్ మార్గాలు మరియు ఇతర మౌలిక వసతులపై మంత్రి దుర్గేష్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించేలా పర్యాటక శాఖ ఈవెంట్ క్యాలెండర్‌లో కొండవీడు ఉత్సవాలను పొందుపరుస్తామని స్పష్టం చేశారు. “పల్నాడు పౌరుషాల పురిటిగడ్డ” అని కొనియాడిన మంత్రి దుర్గేష్, ప్రముఖ కవి శ్రీనాధుడి పద్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు మరియు వేలాదిగా తరలివచ్చిన సందర్శకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link