రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి

తణుకు నియోజవర్గం నుంచి కూటమి అభ్యర్థుల విజయానికి నాంది పలకాలి

టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలి

అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దిశా నిర్దేశం

తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం సాధించేలా తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు సమష్టిగా కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం తణుకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తణుకు కమ్మ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో పోటీ చేసిన కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరూ గెలిచేలా ఇక్కడి నుంచే నాంది పలకాలని కోరారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ వారి అభ్యున్నతికి పార్టీ పాటు పడుతోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చూపించిన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం 90 శాతం ఆచరణలో పెట్టినట్లు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతోపాటు ఇవ్వని హామీలను సైతం అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు అమలు చేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తూ ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తణుకు నియోజకవర్గంలో దాదాపు రూ. 6.50 కోట్లు మేర ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేసినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దాఖలు చేసుకున్న అర్జీలను బుట్ట దాఖలు చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలు తీసుకోవాలని కోరారు. తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు గ్రామస్థాయిలో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే రాధాకృష్ణ దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link