విశాఖపట్నం: జనవరి 5 (కోస్టల్ న్యూస్)
అందం, ఆరోగ్యం (బ్యూటీ అండ్ వెల్నెస్) రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేస్తూ సైమా (SIMA) – ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్‌పో” ఈ నెల 25, 26 తేదీలలో నగరంలోని పోర్ట్ కళవాణి లో ఘనంగా జరగనుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్‌ను సోమవారం సాయంత్రం బీచ్ రోడ్డులోని సుప్రీం హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు దేశంలోని మెట్రో నగరాలకే పరిమితమైన ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ప్రీమియం ఎక్స్‌పోను ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా విశాఖపట్నంలో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ ఎక్స్‌పో ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఎక్స్‌పో నిర్వాహకుడు మోక్ష మాట్లాడుతూ బ్యూటీ అండ్ వెల్నెస్ సెక్టార్‌లో వస్తున్న సరికొత్త మార్పులు, ఉత్పత్తులు ఆవిష్కరణలను ఇక్కడ ప్రదర్శించనున్నారు. ప్రఖ్యాత బ్యూటీ బ్రాండ్లు, స్కిన్ కేర్ సొల్యూషన్స్, హెయిర్ కేర్, కాస్మెటిక్స్, నెయిల్ కేర్ స్పా సేవలకు సంబంధించిన స్టాళ్లు సందర్శకులను అలరించనున్నాయి. కేవలం ప్రదర్శన మాత్రమే కాకుండా, నిపుణుల ద్వారా ప్రత్యేక వర్క్ షాప్‌లను కూడా నిర్వహించనున్నారు. తద్వారా ఔత్సాహికులు నూతన మెళకువలను నేర్చుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. బ్యూటిషన్ కోర్స్ ద్వారా మహిళలు తమ కాళ్ళ పై నిలబడి ఉపాధి పొందెందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. దీనిని పాఠ్యాంశాలుగా చేరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ‘మన్యం వీరుడు’ చిత్ర నిర్మాత, హీరో ఆర్.వి.వి. సత్యనారాయణ, బిఎన్ఏ ఏపీ డైరెక్టర్ జాస్మిన్, గీత గోవాడ, సినీ నటుడు రవితేజ, ఇతర ముఖ్యులు పాల్గొని కార్యక్రమ విశేషాలను వివరించారు. ఈ ఎక్స్‌పో విశాఖలోని బ్యూటీ రంగానికి కొత్త ఊపునిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.


