విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ బాషా
సంపద పంపిణీ తో సంక్షేమ సమాజం సాధ్యపడుతుందని నాగార్జున యూనివర్శిటీ విశ్రాంత ఆచార్యులు అబ్దుల్ నూర్ బాషా ప్రకటించారు.
స్థానిక సురాజ్య భవనంలో జరిగిన “ ప్రజా రిపబ్లిక్ ఉద్యమ పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
కుల, మత, లింగ పరమైన వివక్ష వున్నందువల్లనే ఆయా తరగతుల సమూహాలు పేదరికంలో వున్నాయని సంపదను సృష్టించే శ్రమజీవులకి, సామాన్యులకీ కార్పొరేట్ల దగ్గర పోగుపడ్డ సంపద పై వివిధ పన్నుల ద్వారా “ ప్రత్యేక సంక్షేమ నిధిని” ఏర్పాటు చేసి వివిధ పద్ధతుల ద్వారా పేదరికం లేని సమాజాన్ని సాధించే లక్ష్యం తో ప్రాంభమైన ప్రజా రిపబ్లిక్ ఉద్యమంలో శ్రమజీవుల సంఘాలు , దళిత బహుజన సంఘాలు, మైనారిటీల సంక్షేమ సంఘాలు ప్రగతిశీల పౌర సమాజ సంఘాలు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.
మరో ముఖ్య అతిథి విశ్రాంత ఐ ఎ యస్ బండ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూత్వ విభజన రాజకీయం పైనా, కార్పొరేట్ల సంపద దోపిడీ పైనాపోరాడుతున్న వామపక్ష పార్టీలు , శక్తులు ఒకే వేదిక లో కలిసి ప్రత్యామ్నాయం రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
సభకు అధ్యక్షత వహించిన ప్రజా రిపబ్లిక్ ఉద్యమ కన్వీనర్ డి వి వి యస్ వర్మ మాట్లాడుతూ రాజ్యాంగ పీఠిక ప్రకటించిన సామాజిక, ఆర్ధిక , రాజకీయ న్యాయం కోసం తలపెట్టిన ఈ ఉద్యమం రాజ్యాంగ లక్ష్యాల అమలు కోసం అవసరమైన ప్రజా చైతన్య కార్యకలాపాలను చేపడుతుందని ప్రకటించారు. 10 శాతం కార్పొరేట్ల దగ్గర 78 శాతం దేశ సంపద పోగు పడిందని, 2 నుండి 5 శాతం సంపద పన్ను, వారసత్వ పన్నుల ద్వారా 17 లక్షల కోట్లు అదనంగా ప్రజల సంక్షేమానికి సమకూరతాయన్నారు.
పేద కుటుంబాలకు జాతీయ వార్షిక బోనస్ తోపాటు ఉచితంగా అందరికీ హక్కుగా విద్య, వైద్య సేవలు, నివాస వసతి, ఆహారభద్రత ఉపాధి హామీలు కల్పించ వచ్చునని, రైతుల పంటలకు చట్టబద్ధ మైన లాభసాటి ధరలు అందించ వచ్చునని అన్నారు.ఈ ఉద్యమ విస్తరణ కు అన్ని సంఘాలు ఆసక్తి గల వ్యక్తులు సారధులు కావాలని విజ్ఞప్తి చేశారు.
ఎ ఐ యు సి జిల్లా అధ్యక్షులు కోనాల భీమారావు మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఇలాంటి ఉద్యమం అవసరం అనీ తమ సంఘాలు భాగస్వాములు అవుతాయని ప్రకటించారు. ఈ సభలో ప్రముఖ సంఘ సేవకులు డా. హుస్సేన్ అహమ్మద్, డా. రమేష్ , సంకు మనోరమ, ముస్లిం జే ఏ సీ నాయకులు అబ్దుల్ రహ్మాన్ , నీలం మాల్యాద్రి మాట్లాడారు. సభలో మాజీ మునిసిపల్ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, సి హెచ్ ఏడుకొండలు,బొద్దాని నాగరాజు , న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, జి. సీతారామ రాజు, డా.రఘు, డా.రాంకుమార్, అంబటి రామకృష్ణ , కె వి ఆంజనేయులు, కొండే నాగేశ్వరరావు, సబ్బితి వరప్రసాద్, బి. సంపత్ కుమార్, అట్రు వెంకట్రావు, ఆకెళ్ళ సుబ్రహ్మణ్యం, మందలపర్తి హరీష్ ,కడలి రామారావు, మహ్మద్ స్వాలేహా తదితరులు పాల్గొన్నారు.




