పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలిపల్స్‌ పోలియో

ప్రారంభించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ

పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. జాతీయ పల్స్‌ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తణుకు మున్సిపల్‌ కార్యాలయం వద్ద పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలోని 190 కేంద్రాలు ఏర్పాటు చేసి సుమారు 27 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. తణుకు పట్టణంలో దాదాపు 7 వేల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 2014 నుంచి పోలియో రహిత దేశంగా ప్రకటించిన నాటి నుంచి కొనసాగింపుగా ప్రతి ఒక్కరు పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. పిల్లలు పోలియో బారిన పడకుండా ప్రతి తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి అయిదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. 23వ తేదీన రెండో దశ పోలియో చుక్కలు వేయడానికి అధికారులు ఏర్పాటు చేశారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌తోపాటు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link