గిరి పుత్రుల్లోని ప్రతిభను ఉద్భవింపజేసిన వేదిక ఉద్భవ్-2025
:- మంత్రి కందుల దుర్గేష్
కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ సాంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవ్.. ఉద్భవ్-2025 ముగింపు వేడుకలకు హాజరైన గుంటూరు జిల్లా ఇంచార్జి మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ లో ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడంపై హర్షం
గిరి పుత్రుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రోత్సహిస్తున్నాయని వెల్లడి
మంత్రి కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం పలికిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు
తాడేపల్లి, గుంటూరు : గిరిజన బిడ్డల్లో కళా నైపుణ్యాలను ప్రోత్సహించి వారిని మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లేందుకు ఉద్భవ్-2025 వేడుకలు సరైన వేదిక అని గుంటూరు జిల్లా ఇన్ చార్జి మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. శుక్రవారం కేఎల్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ సాంస్కృతి, సాహిత్య, కళా ఉత్సవ్.. ఉద్భవ్-2025 ముగింపు వేడుకలకు మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులు తరలివచ్చి ప్రతిభ చూపడం అసాధారణ విషయమన్నారు. ఇటువంటి జాతీయ స్థాయి కార్యక్రమానికి ఏపీ వేదిక కావడం గర్వించే విషయమని అన్నారు. ఒక సరికొత్త ఆరంభమే ఈ ఉద్భవ్ అన్న మాటకి అర్థమని పేర్కొన్నారు. సరైన సదుపాయాలు లేని చోటు నుంచి సమగ్ర అభివృద్ధి సాధించడం సామాన్య విషయం కాదని వెల్లడించారు. అడవిలో పుట్టిపెరిగిన వారు సైతం అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ జాతీయ సాంస్కృతి, సాహిత్య మరియు కళా ఉత్సవ్ ఉద్భవ్-2025 వేడుకలు ఆంధ్రప్రదేశ్ లో విజయవంతంగా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదొక అద్భుతమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ దిశానిర్దేశంలో ఇలాంటి గొప్పవేడుక విజయవంతంగా జరుపుకోవడం గర్వించదగ్గ అంశం అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన బిడ్డలకు ఇలాంటి సాంస్కృతిక పోటీలను నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వందలాది మంది బాలబాలికలు తమ అద్భుత ప్రతిభ పాఠవాలతో దేశ సంస్కృతిని సాంప్రదాయాలను ఎలుగెత్తి చాటడం, దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన కళలను ఒకే వేదికపై చూడటానికి రెండు కళ్లు సరిపోలేదన్నారు.. ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. భిన్న జాతులు, సంస్కృతులు కలిగిన సువిశాల భారత దేశంలో గిరి పుత్రుల ప్రతిభని ప్రపంచానికి పరిచయం చేసిన ఉద్భవ్ చరిత్రలో నిలుస్తుంది అన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి అభినందనలు తెలిపారు. గొప్ప ప్రదర్శనలకు చిరునామాగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ సాగుతుండటం గొప్ప విషయం అన్నారు. చదువుతోపాటు ఆల్ రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అందించడం సామాన్యమైన విషయం కాదన్నారు. గిరిజన బిడ్డలకు అత్యుత్తమమైన, నాణ్యమైన విద్యనందించడమే కాకుండా క్రీడలు, కళల్లోనూ మెరికల్లా తీర్చిదిద్దుతున్న అధ్యాపకులకు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. గిరిజన కళల గురించి, మన ఆచార, వ్యవహారాల గురించి దేశవ్యాప్తంగా మార్మోగేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ ఉద్భవ్-2025 ద్వారా గిరిజన విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయడంతో పాటు ఎక్కడో కొండకోనల్లో, అడవి తల్లి ఒడిలో నాగరిక సమాజానికి దూరంగా ఉండే అడవి బిడ్డల్లోని భయం, బిడియం పోగొట్టి వారిలో ఆత్మవిశ్వాసాన్ని, కళల్లో సత్తా చాటాలి అనే నమ్మకాన్ని ఈ కార్యక్రమం కలిగించింది అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ఉద్భవ్ అంటే ఉద్భవించడం అని, గిరి పుత్రుల్లో కొత్త ప్రతిభను ఉద్భవింపజేసిన వేదికని అర్థం అన్నారు. గిరి పుత్రుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ప్రోత్సహిస్తున్నాయి అన్నారు. తద్వారా ఎంతోమంది గిరిజన బిడ్డలు స్టార్లు, సూపర్ స్టార్లుగా ఎదుగుతున్నారన్నారు. మన గిరిజన కళలు ఎంతో ప్రాచీనమైనవని, ఇలాంటి కళలను పట్ల అభిరుచిని, వాటిని సంరక్షించి, భావి తరాలకు అందించాలన్న స్ఫూర్తిని పిల్లల్లో కలిగించే ప్రయత్నం ఈ ఉద్భవ్-2025 ద్వారా జరిగినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా మంత్రి కందల దుర్గేష్ వెల్లడించారు.


