నేటి రోజుల్లో ప్రజలకు బ్యాంకింగ్ అవసరాల దృష్ట్యా ఆర్థిక క్రమశిక్షణ డిజిటల్ కార్యకలాపాలపై ఖాతాదారులకు వ్యవహరించవలసిన తీరుపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం పాలంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో నిర్వహించారు. పాలంగి పిఎసిఎస్ చైర్మన్ కాకర్ల నరసన్న అధ్యక్షతన జరిగిన ఈ అవగాహన సదస్సులో తణుకు డిసిసిబి బ్యాంక్ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ మాధవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిసిసిబి తణుకు బ్రాంచ్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు తన ఖాతా నిర్వహణలో అప్రమత్తతగా ఉంటూ ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. అదేవిధంగా తమ బ్యాంకులో డిపాజిట్లపై 7.5% వడ్డీ ఇస్తున్నారని సీనియర్ సిటిజెన్లకు 8 శాతం వడ్డీ అందజేస్తున్నట్లు తెలిపారు. సొసైటీ చైర్మన్ కాకర్ల నరసన్న మాట్లాడుతూ డి సిసిబి అందిస్తున్న ఆర్.డి. ఖాతా సౌకర్యం సొసైటీ సభ్యులకు తెలియజేస్తామని అదేవిధంగా పాము కాటు, పిడుగు పాటు వల్ల ఏర్పడే అనుకోని సంఘటనల ద్వారా వ్యవసాయదారులు మరణిస్తే ఇన్సూరెన్స్ పొందే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులు తమ బ్యాంకు ఖాతాలు నిర్వహణలో తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటిపి చెప్పమని అడిగితే తెలియజేయరాదని ఎటువంటి డిజిటల్ అరెస్టులు బ్యాంకుల ద్వారా జరగవని తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఏదైనా మోసం జరిగిన ఎడల వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు రైతులు పాల్గొన్నారు.


